సూర్యాపేట, నల్లగొండ జూలై 14 (నమస్తే తెలంగాణ)/జనగామ: అభివృద్ధి, సంక్షేమాలను గాలికి వదిలేసి పాలనలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎక్కడైనా జరిగే సభల్లో తాను ఒక ముఖ్యమంత్రిని అనేది మరచి చెప్పే అబద్ధాలు, తిట్టే తిట్లను చూసి ప్రజలు మండిపడుతున్నారు. రేషన్ కార్డుల పంపిణీ కోసం తిరుమలగిరిలో ఏర్పాటుచేసిన సభలోనూ రేవంత్ వ్యవహారశైలి ఏమాత్రం మారలేదు. కేవలం స్థానిక ఎన్నికల కోసమే రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్టుగా ఉంది తప్ప.. అధికారిక సభలాలేదని అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. తప్పుడు లెక్కలు, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మండిపడుతున్నారు. మహిళలకు తాము అది చేశాము… ఇది చేశాము అంటూ ప్రగల్భాలు పలికిన సమయంలోనూ కెమెరా సభలో మహిళలవైపు తిప్పినా.. వారి నుంచి కనీస స్పందన కరువైంది. బీఆర్ఎస్ హయాంలో ఆరేండ్ల పాటు తుంగతుర్తికి వచ్చిన జలాలు కాళేశ్వరం నీళ్లు కాదని హైదరాబాద్‌లో చాలాసార్లు చెప్పిన రేవంత్‌రెడ్డి.. తిరుమలగిరిలో మాత్రం ఆ నీళ్లు ఎక్కడివి అనేది చెప్పకపోవడం గమనార్హం. ఇక సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీని మూడు సార్లు బండకేసి కొట్టిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై అవాకు లు, చెవాకులు మాట్లాడటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గంలో ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, ఎమ్మెల్యే మందుల సామేల్‌పై అవినీతి ఆరోపణలపై సీఎంతోపాటు పీసీసీ అద్యక్షుడికి స్థానికనేత ఫిర్యాదులు చేయగా ఒక్కసారి కూడా ఇరువర్గాలతో చర్చించిన దాఖలాలు లేకపోగా సోమవారం తిరుమలగిరి సభలో సామేల్‌కు సీఎం చురకలు అంటించారు. ‘సోనియమ్మ నీకు సీటు ఇచ్చి పంపించింది ఇక్కడ గెలిచినవ్… కానీ అందరిని కలుపుకొని పోయే బాధ్యత నీదే.. ఏకచత్రాధిపత్యంగా వ్యవహరించొద్దు’ అంటూ నిండుసభలో సీఎం వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ నాయకులు… బస్సులు, ఇతర వాహనాలు సమకూర్చడంతో సీఎం సభకు జనం వచ్చారు. బస్సుల్లో వచ్చిన వారంతా నేతల ప్రసంగాలకు చప్పుట్లు కొట్టకపోవడం గమనార్హం. తమ ప్రభుత్వం అది చేసింది… ఇది చేసిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా ప్రజల నుంచి కనీస స్పందన రాలేదు. సభ అనంతరం వెళ్లిపోతూ ‘మాకు ఏదో చేశాడట’ అంటూ అనుకుంటూ వెళ్లడం కనిపించింది. వడ్లకు రూ.500ల రూపాయల బోనస్ వేశామని, రుణమాఫీ చేశామని రైతుల కళ్లల్లో ఆనందం చూశామని సీఎం వ్యాఖ్యానించినా సభ నుంచి ఎలాంటి స్పందన లేదు. మహిళల గురించి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, 600 బస్సులను కొనిచ్చి వాళ్ల బస్సులనే ఆర్టీసీకి కిరాయికి నడిపేలా చేశామని… సోలార్ విద్యుత్తు ఉత్పత్తిని వారికే ఇచ్చామని… ఏకంగా అంబానీకి పోటీగా నిలిచేలా పెట్రోల్ బంక్‌లు నడిపించే బాధ్యత కల్పించామని అంటుంటే.. కెమెరాలు మహిళల వైపు తిప్పినా మహిళలు స్పందించలేదు. బస్సుల్లో వచ్చిన వారంతా రోబోల్లా వచ్చారు.. వెళ్లారుతప్ప నేతల ప్రసంగాలకు సంతోషంతో కనీసం చప్పుట్లు కొట్టలేదని ఓ నాయకుడు అనడం కనిపించింది. జనగామ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ సీఎం సభ కోసం తరలించడంతో విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చౌడారం మాడల్ స్కూల్ విద్యార్థులు ప్రమాదకరంగా ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు.. ప్రజలు సీఎంపై విమర్శలు చేశారు.
తిరుమలగిరిలోని సీఎం రేవంత్‌రెడ్డి సభకు.. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డుమ్మా కొట్టారు. గతంలో హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో, నల్లగొండ మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నా రాజగోపాల్‌రెడ్డి పట్టించుకోలేదు. ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశాలకు కూడా దూరంగానే ఉంటున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తాననే హామీతో ఎంపీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టించి, అధిష్ఠానం మోసం చేసిందని రాజగోపాల్‌రెడ్డి సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే పదేండ్లు రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సోమవారం రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో నూతనంగా 5.61 రేషన్‌కార్డులను జారీ చేస్తున్నట్టు, మరో 26లక్షల మంది పేర్లను కొత్తగా రేషన్‌కార్డుల్లో చేర్చుతున్నట్టు వెల్లడించారు. తెలంగాణాలోని ప్రతీ ప్రాజెక్ట్ కాంగ్రెస్ హయాంలోనే కట్టామని చెప్పారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే రెండేండ్లలో 2.85 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి, తెలంగాణను దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపినట్టు చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 60వేల ఉద్యోగాలిచ్చి దేశంలోనే రికార్డు సృష్టించామని, రెండున్నర ఏండ్లు పూర్తయ్యేనాటికి లక్ష ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు.