హైదరాబాద్, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): రీజనల్ రింగ్‌రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్తర, దక్షిణ భాగాలతోపాటు రేడియల్ రోడ్ల నిర్మాణానికి అక్టోబర్ చివరిలోగా భూసేకరణ పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్టు పరిధిలో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ప్రాజెక్టులపై సీఎం సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
వివిధ జిల్లాలకు చెందిన కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, జిల్లాల్లో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు.
ట్రిపుల్ఆర్ ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై అధికారులకు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ నుంచి బందరు పోర్టు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం అంశంపై మాట్లాడుతూ, వీలైనంత త్వరగా రూట్‌మ్యాప్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అలాగే, హైదరాబాద్- శ్రీశైలం హైవేలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం నుంచి వీలైనంత త్వరగా అనుమతులు తీసుకోవాలని చెప్పారు. ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.