సిరిసిల్ల రూరల్ : చత్తీస్‌గఢ్ రాష్ట్రం ( Chhattisgarh encounter ) నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి ( Kadari Satyanarayana Reddy) మృతి చెందారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ భాగంగా గత 21 నెలలుగా కేంద్ర బలగాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేస్తున్నారు.
సోమవారం జరిగిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో కడారి సత్యనారాయణ రెడ్డి అలియస్ కొస( Kosa) అలియస్ సాదు( Sadhu) స్వగ్రామం రాజన్న సిరిసిల్ల( Siricilla) జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెకు చెందిన వ్యక్తని పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన కడారి కృష్ణారెడ్డి,అన్నమ్మ దంపతులకు ఇద్దరు కొడుకులు. కడారి కరుణాకర్‌రెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి, ఒక కూతురు ఉన్నారు. వీరిలో చిన్నవాడైన కడారి సత్యనారాయణరెడ్డికి కమ్యూనిస్టు భావాలు ఉండటంతో చదువుకుంటున్న సమయంలోనే విప్లవాలకకు ఆకర్షితులయ్యాడు.
పెద్దపల్లిలో జిల్లాలో ఐటీఐ చేస్తున్న సమయంలో జరిగిన ఓ గొడవలో హత్య జరుగగా, అప్పటి నుంచి కొస అజ్ఞాతంలోకి వెళ్లి అన్నలతో కలిసి మావోయిస్టుగా మారాడు. ఇక అప్పటి నుంచి ఇంటి వైపు కూడా చూడలేదు. ఇప్పటివరకు సత్యనారాయణరెడ్డి ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. అంచెలంచెలుగా మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగారు.
2012 సంవత్సరంలో పోలీసుశాఖ సత్యనారాయణరెడ్డిపై రూ.25లక్షల రివార్డును ప్రకటించింది. ప్రస్తుతం గోపాలరావుపల్లెలో శిథిలమైన ఇల్లు తప్ప అక్కడ ఎవరూ లేరు. అసలు సత్యనారాయణరెడ్డి ఎలా ఉంటాడో తెలియని గ్మాసు్ సోషల్ మీడియాలో వచ్చినపోటోలనే మొదటిసారి చూసినట్లు చెబుతుండటం గమనార్హం.