e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, January 17, 2022
Home News యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు

యాసంగిలో కొనుగోలు కేంద్రాలు ఉండవు

  • కేంద్రం బియ్యం కొంటేనే రాష్ట్రం సేకరిస్తది
  • క్యాబినెట్‌లో 4 గంటలు చర్చించి నిర్ణయించినం
  • చిల్లర మాటలు నమ్మి రైతులు నష్టపోవద్దు
  • వానకాలం పంట మొత్తం కొనకుంటే
  • బీజేపీ ఆఫీస్‌లో, ఇండియా గేట్‌ దగ్గర పోస్తం
  • కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరిక

హైదరాబాద్‌, నవంబర్‌ 29 (నమస్తే తెలంగాణ): యాసంగిలో బియ్యం కొనుగోలు చేయబోమని కేంద్రం కరాఖండిగా చెప్పినందున వచ్చే సీజన్‌లో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండబోవని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కేంద్రం ధాన్యాన్ని తీసుకొంటేనే రాష్ట్రం సేకరణ మొదలుపెడుతుందని, రాష్ర్టానికి కొని, నిల్వ చేసే శక్తి ఉండదని స్పష్టంచేశారు. సోమవారం క్యాబినెట్‌ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో మీడియాతో మాట్లాడిన మాటలు సమగ్రంగా.. ‘తకేంద్రం చేతులెత్తేసింది కాబట్టి యాసంగిలో రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం ధాన్యాన్ని తీసుకొంటేనే రాష్ట్రం సేకరణ మొదలుపెడుతుంది. కేంద్రం తీసుకోకుంటే మనం ఎక్కడ పెడుతం.

మనకు గోదాములు ఉండవు, నిల్వ చేసే పరిస్థితి ఉండదు. బియ్యమైనా, వడ్లయినా నిల్వ చేయడానికి, కాపాడటానికి శాస్త్రీయ పద్ధతి ఉంటది. వాటిని పీరియాడికల్‌గా నిల్వచేయాలి. తీసేటప్పుడు కూడా పద్ధతిగా తీయాలి. ఆ టెక్నాలజీ రాష్ర్టాల దగ్గర ఉండదు. దేశంలో ఏ ఒక్క రాష్ట్రం దగ్గర కూడా ఉండదు. మనం ఒకటి రెండు నెలలు తాత్కాలికంగా నిల్వ చేయగలుగుతం. కానీ సంవత్సరాల తరబడి దాచగలిగే శక్తి ఏ రాష్ర్టానికి కూడా లేదు. ఆ సామర్థ్యం ఉన్న కేంద్రమే నిటారుగా చేతులెత్తేసింది కాబట్టి.. రాష్ట్రం ధాన్యం సేకరించే ప్రశ్న ఉత్పన్నం కాదు. కొనుగోలు కేంద్రాలు ఉండవు. ఇప్పుడు చెప్పకపోతే.. పంట చేతికొచ్చినంక రైతులు పాపం అమాయకంగా ‘సార్‌.. ముందు చెప్తే మేము వేరే పంట వేసుకుందుము కదా. కొంటరేమో అని ఆశపడ్డం’అని అంటరు. అందుకే స్పష్టంగా చెప్తున్నా.

- Advertisement -

మేం ధైర్యంగా చెప్తం
మేము ఏదైనా ఉంటే ధైర్యంగా, సాహసంగా చెప్తం. మంచినీళ్లు ఇయ్యకుంటే ఓట్లు అడుగనని చెప్పిన. ఇప్పుడు దేశంలో ఇంటింటికీ నీళ్లు ఇస్తున్న ఒకే రాష్ట్రం తెలంగాణ. 24 గంటల కరెంటు ఇస్తే గులాబీ కండువా కప్పుకుంటా అని జానారెడ్డి గతంలో అన్నడు. మేం చేసి చూపించినం. అన్ని టార్గెట్స్‌ సాధించినం. చెప్పిన ప్రతి ఒక్కటి చేసినం. కేంద్రం ధాన్యాన్ని తీసుకున్ననాడు మేం కొనుగోలు చేస్తమని చెప్పినం. కొన్నం. ధాన్యం కొన్నంక మూడురోజుల్లో బ్యాంకుల్లో డబ్బు వేస్తమని చెప్పినం. వేసినం. బీజేపీలాగా మోసం చేయలేదు. అబద్ధాలు చెప్పలేదు. ఆ ఖర్మ మాకు లేదు. తెలంగాణ బిడ్డగా, రాష్ర్టాన్ని తెచ్చి, మీ ఆస్తులను కోటానుకోట్లు పెంచి, రైతుబంధు ఇచ్చిన వ్యక్తిగా ఇప్పుడు నేను ధైర్యంగా చెప్తున్నా.

దేశం మొత్తం ఆహార ధాన్యాలు పంచాల్సిన రాజ్యాంగయుతమైన బాధ్యత కేంద్రం మీద ఉన్నది. ఈ చేతగాని దద్దమ్మ కేంద్రప్రభుత్వం సామాజిక బాధ్యత నుంచి పారిపోతున్నది. రైతు వ్యతిరేక విధానంలో పోతున్నది. కాబట్టి మేం వడ్లు కొనుగోలు చేయలేమని చెప్తున్నా. మాకు ఆ ధైర్యం ఉన్నది. రైతులు పంట పండించి నష్టపోవద్దనేదే మా ఆరాటం. మేం రైతులను కష్టపడి సాదుకున్నం. ఇష్టపడి మంచిగ చేసుకొన్నం. మన భూముల విలువను పెంచుకొన్నం. ఈ దిక్కుమాలిన కేంద్రం రైతులను మళ్లీ దరిద్రంలోకి నెట్టాలని చూస్తున్నది. కాబట్టి ఈ దిక్కుమాలిన రాజకీయ బేహారుల పాలిట పడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ యాసంగి పంటకు కొనుగోలు కేంద్రాలు ఉండవు.

కరోనా వేళ కొనుగోళ్లతో 10 వేల కోట్లు నష్టం
కరోనా సమయంలో జుక్కల్‌, నారాయణఖేడ్‌, నిజామాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో రైతులు జొన్నలు, మక్కలు వేస్తే విధిలేక రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. వాటిని ఎక్కువ ధరకు కొని, తక్కువ ధరకు అమ్మాల్సి వచ్చింది. కొన్నైతే అమ్ముడు పోలేదు. ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల పైచిలుకు నష్టపోయింది. ఇవేమీ పట్టించుకోకుండా ఆ వాట్సాప్‌ యూనివర్సిటీలో పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నరు. ‘రైతులు పండిచేది బాయిల్డ్‌ రైస్‌ కాదు. అది మిల్లర్లకు సంబంధించింది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిల్లర్లకు అనుకూలంగా ఉన్నది’అని దుర్మార్గపు, దిగజారుడు, దిక్కుమాలిన, దరిద్రపుగొట్టు రాజకీయం చేస్తున్నరు. రైతు లేనిదే మిల్లర్‌ ఉంటడా? మిల్లర్‌ లేనిది రైతు ఉంటడా?. రైతు పండించిన ధాన్యం.. బియ్యం కాకపోతే అమ్ముడు పోతదా? ఎఫ్‌సీఐ తీసుకుంటదా? అసలు రైస్‌ మిల్లర్లను ప్రోత్సహించి బాయిల్డ్‌ రైస్‌ పెట్టించిందే ఎఫ్‌సీఐ.

పేగులు తెగేదాక కొట్లాడిన
ధాన్యం కొనిపియ్యాలని నేను పేగులు తెగేదాకా కొట్లాడిన. మూడునాలుగు సార్లు నేను ఢిల్లీకి పోయిన. ప్రధానికి చాలా సందర్భాల్లో చెప్పిన, లేఖలు రాసిన, ఇటీవల ధర్నా నుంచి ప్రధానికి ఓపెన్‌ లెటర్‌ రాసిన. ఒక్కసారి కూడా సమాధానం రాలేదు. రాష్ట్ర అధికారులు కనీసం 15 సార్లు ఢిల్లీకి పోయిన్రు. వ్యవసాయ, పౌరసరఫరాలశాఖల మంత్రుల నాయకత్వంలో మంత్రివర్గ బృందం, ఎంపీలు ఆరుసార్లు పోయిన్రు. విమానం ఖర్చులు దండుగైపోయినయి తప్ప లాభం లేదు.

దేశాన్ని నడపడం చేతగాని కేంద్రం
వానకాలం పంటకు కేంద్రం టార్గెట్‌ 40 లక్షల టన్నులు దాటుతలేదు. అయినా రైతుల నుంచి ఎంత వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. కేంద్రం కొనకపోతే బీజేపీ ఆఫీస్‌ ముందు, ప్రధాని ఆఫీస్‌ ముందు పారబోస్తం. పోతెవాయె తుట్లె బాగోతం అనుకొని.. వెయ్యి లారీలల్ల తీసుకపోయి ఇండియాగేట్‌ కాడ కూడా పోస్తం. వానకాలంలో ఎంతైనా కొంటామని కిషన్‌రెడ్డి అంటున్నడు కదా.. కొనకపోతే ఇక్కడ కిషన్‌రెడ్డి ఇంట్లో, బీజేపీ ఆఫీస్‌లో కూడా పోస్తం. వీళ్ల చేష్టలు ప్రపంచానికి తెలియాలి. మీ తప్పుడు విధానాలతో.. దేశాన్ని నడపడం చేతగాక, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం చేతగాక దేశాన్ని అప్పులపాలు చేసిన్రు. ఇప్పుడు పంటలు కొనక రైతులను ఆగం చేస్తున్నరు. ఉల్టా రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం చేస్తరా?

కేంద్రానికి ఏం శిక్ష విధించాలో ఆలోచించండి
ధాన్యాన్ని కేంద్రం తీసుకోబోమని చెప్తున్నది కాబట్టి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఉండవు. రైతులు తమ తిండి కోసమో, విత్తనాల కంపెనీలతో ఒప్పందం ఉంటేనో, వ్యాపారులతో మాట్లాడుకొని ఉంటేనో వేసుకోవచ్చు. రైతుబంధు ఇస్తం.. నీళ్లు ఇస్తం.. 24 గంటల ఫుల్‌ కరెంట్‌ ఇస్తం.. కేసీఆర్‌ చేతుల, రాష్ట్ర ప్రభుత్వం చేతుల ఏమున్నయో అన్నీ కడుపునిండ ఇస్తం. కానీ చేతుల్లో ఉండి కూడా తప్పించుకొనే కేంద్రానికి ఏం శిక్ష విధించాలో మీరు ఆలోచించండి. ధాన్యం కొనుగోలు చేసే ఆర్థిక శక్తి, నిల్వచేసే శక్తి, ఎగుమతి చేసే అనుమతి మాకు లేదు. కాబట్టి రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలు ఉండవు.

  • సీఎం కేసీఆర్‌
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement