ధాన్యం కొనుగోళ్ల వివరాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీగా వెల్లడించేది. ఇప్పుడు అందుకు భిన్నమైన స్థితి. కొనుగోళ్ల లోగుట్టు బయటపడ్తుందన్న భయమో, ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ‘నో డాటా అవైలబుల్’ అనేస్తున్నది.
హైదరాబాద్, నవంబర్ 17(నమస్తే తెలంగాణ): ఎప్పటికప్పుడు వెల్లడించాల్సిన ధాన్యం కొనుగోళ్ల వివరాలను సివిల్ సైప్లె అధికారులు రహస్యంగా ఉంచుతున్నారు. వివరాలను వెల్లడించేందుకు ససేమిరా అంటున్నారు. ఇన్ఫర్మేషన్ షేరింగ్లో భాగంగా ఇతర శాఖలకు కూడా కొనుగోళ్ల వివరాలను ఇచ్చేందుకు సివిల్సైప్లె అధికారులు నిరాకరిస్తున్నట్టు తెలిసింది. ఎక్కడ కూడా వివరాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఉన్నతాధికారులు సైతం హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలిసింది. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమై నెలన్నర కావొస్తున్నా.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా మీడియాకు ధాన్యం సేకరణలో సివిల్ సైప్లెతో పాటు మార్కెటింగ్, వ్యవసాయ శాఖతో పాటు ఇతర శాఖలు కూడా భాగస్వామ్యమవుతున్నాయి. ఇందు లో భాగంగానే రోజువారీగా ధాన్యం కొనుగోళ్ల వివరాలను సుమారు 10-15 శాఖలకు సివిల్ సైప్లె పంపిస్తుంది. ఇది గత సీజన్ వరకు అనవాయితీగా ఉండేది. ప్రతిరోజు కొనుగోళ్ల వివరాలను మెయిల్ ద్వారా ఈ శాఖలకు పంపించేవారు. కానీ ఈ సీజన్ నుంచి ఈ విధానానికి స్వస్తి పలికారు. కనీసం ఆ శాఖల నుంచి అధికారులు అడిగినా సివిల్సైప్లె అధికారులు స్పందించడంలేదని తెలిసింది. దీంతో ఇతర శాఖల అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ‘గతంలో రోజువారీగా ధాన్యం కొనుగోళ్ల వివరాలు వచ్చేవి. ఇప్పుడు పంపించడం లేదు ఎందుకని అడిగితే స్పందించడం లేదు. ఎన్నిమార్లు అడిగినా వివరాలు మాత్రం ఇవ్వడం లే దు. దీంతో మేమే మా క్షేత్రస్థాయి అధికారుల నుంచి వివరాలు సేకరించుకుంటున్నాం’ అని ఓ శాఖ అధికారి తన ఆవేదన వ్యక్తం చేయడం గమనార్హం.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోళ్ల వివరాలు వెల్లడించేవారు. ఓసారి మంత్రి, మరోసారి కమిషనర్ లేదంటే చైర్మన్ ఇలా ఎవరో ఒకరు ఏకంగా విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ప్రజలకు వివరాలకు తెలియజేసేవారు. కానీ ఇప్పుడు పూర్తి విరుద్ధంగా కొనుగోళ్ల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా ఈ సీజన్లో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. మిల్లర్లతో ఇబ్బందులు, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, చేసిన చోట నెమ్మదిగా కొనుగోళ్లు చేయడం వంటి ఇబ్బందులున్నాయి. దీంతో ఎక్కడికక్కడ రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సీజన్లో కోటి టన్నుల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 10 లక్షల టన్నులు కూడా కొనుగోలు చేయలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో కొనుగోళ్ల వివరాలు బయటకు పొక్కితే ప్రభుత్వం ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కొనుగోళ్లలో డొల్లతనం బయటపడకుండా ఉండేందుకే వివరాలను గోప్యంగా ఉంచుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.