(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రష్యా నుంచి చమురు కొనుగోలును బూచిగా చూపుతూ భారత్, చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల వాత పెడుతున్నారు. అంతటితో ఆగకుండా ఈ రెండు దేశాలపై టారిఫ్‌లు విధించాలని నాటో, జీ7 దేశాలను ఉసిగొల్పుతున్నారు. ట్రంప్ చర్యలను తప్పుబడుతూ ప్రధాని మోదీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అయితే, చైనా మాత్రం తీవ్రంగా స్పందించింది. తమను ఏకపక్షంగా వేధించేందుకు ఆర్థిక బలప్రదర్శన కోసమే అమెరికా ఇటువంటి చర్యలు చేపడుతున్నదని మండిపడింది. అమెరికా చెప్పినట్టు చేస్తే, తాము కూడా ప్రతిచర్యలు చేపడుతామని నాటో, జీ7 దేశాలను హెచ్చరించింది. భారత్‌పై టారిఫ్‌లు విధించాలని నాటో, జీ7 దేశాలపై ఇటీవల ట్రంప్ ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయితే, ట్రంప్ చర్యలను ఖండిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ప్రకటన కూడా చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సుంకాల పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొంటున్న ఏక పక్ష నిర్ణయాలను తప్పుబడుతూ పలు దేశాలు ఎప్పటికప్పుడు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ప్రకటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా తీవ్రంగా స్పందించారు. తమ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా పోల్చడంపై రష్యా కూడా ట్రంప్‌పై గట్టిగానే మండిపడింది. ఇప్పుడు నాటో, జీ7 దేశాలను తమపై ఉసిగొల్పిన ట్రంప్‌ను చైనా గట్టి హెచ్చరికలతో కట్టడి చేసింది.
ట్రంప్‌కు మిగతా దేశాలు గట్టిగా బదులిస్తుంటే, ప్రధాని మోదీ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలపై, ఆయన విధించిన సుంకాలపై ఏ విధంగానూ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. రష్యా-భారత్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్ గత నెలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకొన్నా తనకు సంబంధం లేదన్న ట్రంప్.. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అభివర్ణించారు. ఇక, పాకిస్థాన్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందం గురించి చెప్తూ.. భారత్‌పై నోరు జారారు. భవిష్యత్తులో భారత్‌కు పాక్ చమురు విక్రయించవచ్చంటూ ఊహాగానాలు చేశారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, మోదీ ఖండించకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.