న్యూఢిల్లీ : కృత్రిమ మేధ (ఏఐ) కంటెంట్ క్రియేటర్ల కోసం కొత్త నిబంధనలను పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనల ప్రకారం, ఏఐ జనరేటెడ్ వీడియోలు, ఆర్టికల్స్ కోసం లైసెన్స్ తీసుకోవలసి ఉంటుంది, తప్పనిసరిగా లేబులింగ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ముసాయిదా నివేదికను బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే నేతృత్వంలోని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై స్థాయీ సంఘం రూపొందించింది. ఈ నివేదికను లోక్ సభ సభాపతి ఓం బిర్లాకు సమర్పించింది. సమాచార, ప్రసార; ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వంటి వివిధ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం ఉండాలని సూచించింది.
ఫేక్ న్యూస్‌ను సృష్టించి, వ్యాపింపజేసే వారిని గుర్తించి, శిక్షించడానికి పటిష్టమైన న్యాయ, టెక్నలాజికల్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. ఏఐ టూల్స్‌ను ఉపయోగించి సులువుగా కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. దీనివల్ల ఏది వాస్తవం, ఏది నకిలీ అనేది తెలుసుకోవడం కష్టమవుతున్నది. ఏఐ జనరేటెడ్ ఫేక్ న్యూస్ ప్రజా శాంతికి విఘాతం కలిగిస్తుందని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఈ కమిటీ పేర్కొంది.