రాజ్‌కోట్: అహ్మదాబాద్‌లో జూన్ 12న జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత విజయ్ రూపానీ పట్ల ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు ఏమాత్రం గౌరవభావముందో బయటపెట్టే దారుణ ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్‌కు బీజేపీ ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ రూపానీ మరణించిన మూడు నెలల తర్వాత ఆయన కుటుంబం పట్ల బీజేపీ, ఆ పార్టీ నాయకులు ఎంత లేకిగా వ్యవహరించారో ఈ సంఘటన నిరూపిస్తుంది. ప్రమాదవశాత్తు కూలిపోయి 141 మంది మరణించిన ఎయిరిండియా విమానంలో విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన తన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు లండన్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆయన భౌతికకాయాన్ని గుర్తించేందుకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన తర్వాత జూన్ 16న రాజ్‌కోట్‌లో అంత్యక్రియలు జరిగాయి.
ఆయన భౌతికకాయాన్ని తీసుకువెళుతున్న శకటాన్ని పూలతో అలంకరించారు. అంతకుముందు ఆయన భౌతికకాయానికి పలువురు బీజేపీ ప్రముఖులు పుష్ప నివాళులర్పించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్ పాటిల్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, రాష్ర్టానికి చెందిన పలువురు ప్రముఖుల సమక్షంలో అధికారిక లాంఛనాలతో రూపానీ భౌతికకాయానికి అంత్యక్రియలు జరిగాయి. వేలాదిమంది ప్రజలు తమ అభిమాన నాయకునికి తుది వీడ్కోలు పలికారు. అయితే అంత్యక్రియల సందర్భంగా ఉపయోగించిన పూలు, షామియానాలు, ఇతర ఖర్చులను చెల్లించాలంటూ స్థానిక వ్యాపారులు రూపానీ కుటుంబ సభ్యుల చేతిలో రూ. 25 లక్షల బిల్లు పెట్టారు. ఈ బిల్లులు చెల్లించడానికి రాష్ట్ర బీజేపీ నిరాకరించినట్లు వ్యాపారులు చెప్పడంతో రూపానీ కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.
తాము డబ్బు చెల్లించడం గురించి బాధపడడం లేదని, కాని బీజేపీ కోసం అహర్నిశలు పాటుపడిన ఓ సీనియర్ నాయకుడికి, మాజీ ముఖ్యమంత్రికి పార్టీ ఇచ్చే గౌరవం ఇదేనా? అని రూపానీ కుటుంబ సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు జోక్యం చేసుకున్న పార్టీకి చెందిన ఇద్దరు సౌరాష్ట్ర నాయకులు చివరకు చేతులెత్తేసినట్లు సమాచారం. సున్నిత మనస్కుడిగా పేరుపొందిన విజయ్ రూపానీ పట్ల బీజేపీ ఇంత కర్కశంగా వ్యవహరించడం పట్ల పార్టీ కార్యకర్తలే కాక సామాన్య ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండోసారి సీఎం అయ్యాక 2021లో హఠాత్తుగా ఆ పదవికి రాజీనామా చేసి రూపానీ అందరినీ విస్మయానికి గురిచేశారు. అప్పుడు రూపానీ, తాజాగా ధన్‌ఖడ్‌ల ఉదంతాలే తీసుకుంటే బీజేపీలో సీనియర్ నాయకుల ఆకస్మిక రాజీనామాల వెనుక ఏ అదృశ్య శక్తులున్నాయో ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది.