చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచడానికి ముస్తాబవుతున్నది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆద్యంతం హాస్య ప్రధానంగా సాగుతుందని, చిరంజీవి తనదైన శైలి వింటేజ్ కామెడీతో ప్రేక్షకుల్ని అలరిస్తారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. వచ్చే నెలలో 20 రోజుల పాటు నాన్‌స్టాప్ షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రంలో అగ్ర నటుడు వెంకటేష్ కీలకమైన అతిథి పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే.
చిరంజీవి, వెంకటేష్ ఇద్దరూ సమకాలీనులు కావడం..దాదాపు 40 ఏళ్లుగా సూపర్స్టార్డమ్తో కొనసాగుతుండటంతో వీరిద్దరి కాంబో సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఈ సూపర్‌స్టార్స్ ఇద్దరూ ఓ పాటలో కలిసి సందడి చేయబోతున్నారట. దీనిని అక్టోబర్ షెడ్యూల్లో తెరకెక్కిస్తారని తెలిసింది. ఈ పాట కోసం సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో ఇప్పటికే అద్భుతమైన ట్యూన్‌ను సిద్ధం చేశారని, చిరు-వెంకీల సిగ్నేచర్స్ డ్యాన్ మూమెంట్స్, ఎనర్జీతో ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఈ చిత్రాన్ని షైన్‌స్క్రీన్స్ అండ్ గోల్డ్‌బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.