న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కొత్తగా తీసుకొచ్చిన వక్ఫ్(సవరణ) చట్టం, 2025 చట్టబద్ధతను సవాలు చేసిన పిటిషనర్లకు సుప్రీంకోర్టులో పాక్షిక ఉపశమనం లభించింది. వక్ఫ్ చట్టంలోని కొన్ని వివాదాస్పద నిబంధనలపై సుప్రీంకోర్టు సోమవారం స్టే ఇచ్చింది. వక్ఫ్ బోర్డులో ఎవరు సభ్యులుగా ఉండాలన్న అంశంపై సిఫార్సు చేయడంతోపాటు వక్ఫ్‌ను ఎవరు సృష్టించవచ్చు, ఆక్రమణలకు చెందిన వివాదాలను ఎవరు పరిష్కరించాలన్న అంశాలకు సంబంధించిన నిబంధనలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. వక్ఫ్ చట్టంపై మొత్తంగా స్టే విధించాల్సిన అవసరం ప్రస్తుతం న్యాయస్థానానికి కనిపించడం లేదని, కొత్త చట్టంలో రాజ్యాంగపరమైన సవాళ్లకు సంబంధించి విస్తృత స్థాయిలో విచారణ జరుపుతామని సీజేఐ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది.
మొత్తం చట్టాన్నే పిటిషనర్లు సవాలు చేశారని, అయితే మౌలికంగా చట్టంలోని 3(ఆర్), 3సీ, 14 సెక్షన్లను పిటిషనర్లు సవాలు చేశారని ధర్మాసనం తెలిపింది. సవాలు చేసిన సెక్షన్లపై తాము స్టే ఇస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. వక్ఫ్‌ను సృష్టించే వ్యక్తి ఐదేళ్ల పాటు ఇస్లాం మతాన్ని తప్పనిసరిగా పాటించాలన్న నిబంధనను(సెక్షన్ 3(ఆర్) నిలిపివేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. ఇస్లాంను ఆచరిస్తున్న వ్యక్తిని నిర్ధారించడానికి నిబంధనలు రూపొందించే వరకు ఈ సెక్షన్‌పై స్టే విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. వక్ఫ్ ఆస్తిగా ప్రకటించిన ఆస్తి ప్రభుత్వ ఆస్తి అవునా కాదా అన్న విషయాన్ని నిర్ధారించి ఉత్తర్వులు జారీ చేసే అధికారాన్ని కలెక్టర్‌కు అప్పగిస్తూ చట్టంలో పొందుపరిచిన నిబంధనపై(సెక్షన్ 3సీ(4)) కూడా ధర్మాసనం స్టే విధించింది.
వక్ఫ్ ఆస్తిగా ప్రకటించిన ఆస్తి ఆక్రమణ ద్వారా జరిగిందీ లేనిదీ నిర్ధారిస్తూ ప్రభుత్వం నియమించిన అధికారి నివేదికను సమర్పించే వరకు వక్ఫ్ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా పరిగణించరాదన్న నిబంధనపై(సెక్షన్ 3సీ(2) కూడా కోర్టు స్టే ఇచ్చింది. వక్ఫ్ బోర్డులలో ముస్లిమేతర సభ్యులను చేర్చాలన్న నిబంధనపై(సెక్షన్ 9,14) స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో ముగ్గురికి మించి ముస్లిమేతర సభ్యులను నియమించరాదని, వక్ఫ్ కౌన్సిళ్లలో నలుగురికి మించి ముస్లిమేతర సభ్యులను నియమించరాదని ధర్మాసనం స్పష్టం చేసింది.