వాషింగ్టన్, సెప్టెంబర్ 115: భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరగనున్న వేళ ట్రంప్ సర్కార్ నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి ముందస్తు బెదిరింపులు మొదలయ్యాయి. అమెరికాలో పండించిన మక్క పంటను భారత్ కొనుగోలు చేయడానికి నిరాకరిస్తే అమెరికన్ మార్కెట్‌కు భారత్ దూరం కావలసి వస్తుందని అమెరికా వాణిజ్య మంత్రి హోవర్డ్ లుత్నిక్ హెచ్చరించారు. ఒకపక్క అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తన ఆంక్షలను సడలించుకునే ప్రయత్నం చేస్తుండగా లుత్నిక్ మాత్రం భారత్ తన సుంకాలను తగ్గించుకోకపోతే కష్టకాలం ఎదుర్కోవలసి వస్తుందని బెదిరించడం గమనార్హం. ఆక్సియోస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో లుత్నిక్ మాట్లాడుతూ భారత్-అమెరికా సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికాకు విక్రయించి భారత్ సొమ్ము చేసుకుంటోంది. మా మార్కెట్లోకి వచ్చి ప్రయోజనం పొందాలని మేము ఆహ్వానిస్తుంటే భారత్ మాత్రం మమ్మల్ని తన మార్కెట్లోకి మేము రాకుండా అడ్డుకుంటోంది అని ఆయన ఆరోపించారు.
తమకు 140 కోట్ల జనాభా ఉందని భారత్ గొప్పలు చెప్పుకుంటుందని, 140 కోట్ల మంది కలసి ఒక బుషెల్ మక్కలు (అంటే 25.4 కిలోలతో సమానం) కూడా కొనలేరా అని ఆయన ప్రశ్నించారు. వాళ్లు(భారత్) మాత్రం తమకు అన్నీ అమ్ముతారని, తమ దగ్గర నుంచి మాత్రం మక్కజొన్న కూడా కొనరని, అన్ని వస్తువులపై సుంకాలు మాత్రం విధిస్తారని, ఇది తమకు బాధ కలిగించదా అని ఆయన ఆక్రోశం వెళ్లగక్కారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలు తగ్గించి, తాము ఎలా వ్యవహరిస్తామో తమ పట్ల కూడా భారత్ అలాగే వ్యవహరించాలని ట్రంప్ కోరుతున్నారని లుత్నిక్ చెప్పారు. గతంలో జరిగిన తప్పిదాలను సరిచేసేందుకు ట్రంప్ ప్రభుత్వం పోరాడుతోందని, తాము దీన్ని సరిచేసేంత వరకు సుంకాలు దారిలోకి రావని ఆయన వ్యాఖ్యానించారు. ఇది అధ్యక్షుడు ట్రంప్ మోడల్. మీరు ఒప్పుకునైనా తీరాలి లేదా ప్రపంచంలోని అతి పెద్ద వినియోగదారుడితో వ్యాపారం చేసే అవకాశాన్నయినా కోల్పోవాలి అంటూ ఆయన హెచ్చరించారు.
బీబీసీ నివేదిక ప్రకారం చైనా ఆర్థిక ఆంక్షల కారణంగా అమెరికా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు అమెరికా వ్యవసాయ గ్రూపులు హెచ్చరించాయి. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం సాగుతున్న దరిమిలా అమెరికా మక్కల కోసం చైనా నుంచి కొనుగోలు ఆర్డర్లు గణనీయంగా తగ్గిపోయాయి. ఫలితంగా అమెరికా సన్నకారు రైతులు దివాలా తీసినట్లు ప్రకటిస్తున్నారు. గత ఐదేళ్లలో అత్యధికంగా మక్క రైతులు ఈ ఏడాది నష్టపోయినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నప్పటికీ అవి ప్రధానంగా టెక్నాలజీ అందుబాటు, అరుదైన భూ ఖనిజాల ఎగుమతులు తదితర అంశాలకే పరిమితమవుతున్నాయి. అమెరికా రైతులకు కొత్త మార్కెట్‌ను సృష్టించే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం మక్క ఎగుమతుల కోసం భారత్‌నే లక్ష్యంగా చేసుకున్నట్లు కనపడుతోంది.