ఖైరతాబాద్, అక్టోబర్ 13 : రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేరిస్తేనే ఇప్పుడు అనుకున్నట్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యమవుతాయని వక్తలు అభిప్రాయపడ్డారు. సోమవారం బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షతన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, విశ్రాంత జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలన్న చిత్తశుద్ధి రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ అధిష్ఠానానికి లేదని చెప్పారు. ఢిల్లీకి వెళ్లి జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేసే సోయి ఉంటది కానీ ప్రధాని వద్దకు వెళ్లి 9వ షెడ్యూల్లో పెట్టాలని అడిగే ఆలోచన ఎందుకు ఉండదని ప్రశ్నించారు. బీసీల వాటా గురించి తరుచూ మాట్లాడే రాహుల్‌గాంధీ తొమ్మిదో షెడ్యూల్లో పెట్టాలని కనీసం ఒక్కసారి కూడా ఎందుకు కోరలేదని నిలదీశారు. ఇండియా కూటమికి దాదాపు 230 మంది ఎంపీలున్నారని, వారితోనైనా పార్లమెంట్లో రిజర్వేషన్ల గురించి రాహుల్‌గాంధీ చెప్పించలేదని విమర్శించారు. దీనిబట్టి బీసీ రిజర్వేషన్లపై రాహుల్‌గాంధీకి ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతున్నదని తెలిపారు. 9వ షెడ్యూల్ ద్వారానే అనుకున్న రిజర్వేషన్లు సాధ్యమవుతాయని చెప్పినా ఆర్ కృష్ణయ్యలాంటి వాళ్లు దృష్టిసారించలేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా బీసీలు తెలుసుకోవాలని, ఆయా జాతీయ పార్టీలతో ఒరిగేదేమి ఉండదని జస్టిస్ ఈశ్వరయ్య చెప్పారు. అగ్రవర్ణాల అభ్యర్థులకు ఓట్లు వేయకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే వైఖరిని అవలంబిస్తున్నాయని ఎస్సీ, ఎస్టీ, బీసీ జేఏసి చైర్మన్ విశారదన్ మహరాజ్ తెలిపారు. బీసీలకు 42 శాతం కాదని, 56 శాతం రిజర్వేషన్లు రావాలని సూచించారు.ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధం ఉండడంతోపాటు బీజీపీ ఇచ్చిన రాజ్యసభ సభత్వాన్ని ఆసరా చేసుకొని బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టించాలని ఆర్ కృష్ణయ్యను కోరారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ప్రాణ స్నేహితుడి కంటే ఎక్కువ ప్రేమించే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సీఎంను వారానికోసారి ఢిల్లీకి తీసుకెళ్లి రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టించేలా ఒత్తిడి చేయాలని సూచించారు. అనుకున్న రిజర్వేషన్ల సాధనకై బీసీ ఉద్యమం యుద్ధరూపం దాల్చిందని పేర్కొన్నారు. సమావేశంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు, తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ అధ్యక్షుడు బాలగౌని బాల్‌రాజ్ గౌడ్, బీసీ సంఘాల నాయకులు రాచాల యుగేందర్ గౌడ్, మేకపోతుల నరేందర్ గౌడ్, ఎస్ దుర్గయ్య గౌడ్, అంబాల నారాయణ గౌడ్, చామకూర రాజు, కేవీ గౌడ్, పొన్నం దేవరాజు గౌడ్, నాగేశ్వర్ రావు, బత్తిని కీర్తిలత గౌడ్, ఆంజనేయులు, రఘురాం తదితరులు పాల్గొన్నారు.