అందోలు, జూన్ 12: సంగారెడ్డి జిల్లా ప్రజల గుండెకాయ, కోట్లాది మందికి తాగు, సాగునీరు అందించే జీవనాడి అయిన సింగూరు జలాశయం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార పార్టీ నేతల అక్రమ సంపాదనకు అడ్డాగా మారిందని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి దామోదర రాజనరసింహ అనుచరులు, ఆయన బామ్మర్ది, పీఏల కనుసన్నల్లో సింగూరు ముంపు ప్రాంతంలో సాగుతున్న భూకబ్జాలు, అక్రమ చేపల చెరువుల తవ్వకాలపై ఆయన ఘాటుగా స్పందించారు. ఈ అక్రమాలకు సంబంధించిన వీడియో ఆధారాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా క్రాంతికిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సంగారెడ్డి జిల్లా అం దోల్ నియోజకవర్గంలో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, ఇకడ ప్రజాప్రభుత్వం నడుస్తోందా లేక మంత్రి గారి ప్రైవే ట్ మాఫియా నడుస్తోందా? అని ప్రశ్నించారు.
ఒక వైపు మంత్రి బామ్మర్ది సాయిపేట, ఖాదిరాబాద్ ముంపు ప్రాంతా ల్లో యథేచ్ఛగా అక్రమ కట్టడా లు నిర్మిస్తుం టే.. ఇంకోవైపు మంత్రి ముఖ్య అనుయాయులు నిర్జప్ల, భూతూరు, దేవునూరు, ఖాదిరాబాద్ గ్రామ శివార్లలోని ముంపు భూములను కబ్జా చేసి, ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చలవిడిగా అక్రమ చేపల చెరువులు తవ్వుతున్నారని ఆరోపించారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు మంత్రి వర్గానికి, ఆయన పీఏలకు పూర్తిగా దాసోహం అయ్యారని ధ్వజమెత్తారు. అధికారుల పూర్తి అండదండలతోనే దోపిడీలో భాగస్వాములు కాబట్టే కళ్లుండి కపట నిద్ర నటిస్తున్నారని మండిపడ్డారు.
అందోల్ ప్రజల సాగునీటి అవసరాలను పకనబెట్టి, సింగూరు ప్రాజెక్టును ఖాళీ చేసింది.. మంత్రి గారి అనుచరులు అక్రమంగా చేపల చెరువులు తవ్వుకోవడానికేనా? అని ప్రజలు అడుగుతున్నారన్నారు. నీళ్లు లేని సమయంలో పట్టాదారులు తమ భూముల్లో పంటలు పండించుకోవాలి కానీ, కాంగ్రెస్ నాయకులు ఆ ముంపు ప్రాంతాన్ని తమ సొంత ఆస్తిలాగా ఇతరులకు కిరాయికి ఇచ్చుకుంటూ రూ. కోట్లు వెనుకేసుకుంటున్నారు. ఇది అందోల్ ప్రజలను నట్టేట ముంచడం కాదా? అని క్రాంతి కిరణ్ నిలదీశారు.
అక్రమ చేపల చెరువుల్లో క్వింటాళ్ల కొద్దీ నాన్-వెజ్ వ్యర్థాలను, రసాయనాలను దాణాగా ఉపయోగిస్తూ హైదరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలకు తాగునీరు అందించే సింగూరు జలాశయాన్ని కలుషితం చేస్తున్నారన్నారు. పర్యావరణాన్ని పూర్తిగా నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.