నెట్వర్క్ నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 9 : తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాపాలన కాదు విధ్వం స పాలన కొనసాగుతుందని ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఎస్. రాజేందర్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. సోమవారం ఉమ్మడి పాలమూరులోని వివిధ మున్సిపాలిటీల్లో చివరి రోజు రోడ్‌షోలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు 420 హామీలు, ఆరు గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేతకాక రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు. నేడు అవే మోసపూరిత హామీలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తున్నందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ హయాంలోనే మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాయని, ముఖ్యంగా పట్టణాల్లో పారిశుధ్యం, తాగునీటి వసతి, మురుగుకాల్వల నిర్మాణం, లేఅవుట్ల క్రమబద్ధీకరణ, పార్కుల ఏర్పాటు వంటి పనులు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే చేపట్టినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం చెత్తను తీసుకెళ్లే ట్రాక్టర్లకు డీజిల్ పోయించలేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు.
మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యం అన్నారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్, దానికి వంతపాడుతున్న బీజేపీలకు ఓటు వేస్తే మళ్లీ మోసపోవడం ఖాయమని, ఇక ఆలోచించి ఓటు వేయాల్సిన సమయం వచ్చిందని నిర్ణయం మీ చేతుల్లోనే ఉందని వారు ప్రజలకు సూచించారు. అయితే మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ రోడ్‌షోలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది.