6 గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నగర ప్రజలను నమ్మించి మోసం చేసింది. పేదల ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చాక నరకం చూపిస్తున్నది. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయకుండా మొండికేస్తున్నది. అమలు చేసిన ఒకటీ ఆరా పథకాలు మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి. మహిళలకు వంట గ్యాస్ సబ్సిడీ కింద రూ.500 ఖాతాలో జమ చేస్తామని చెప్పి రెండు నెలలు ఇచ్చినట్లే ఇచ్చి నిలిపేశారు. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని అర్హులైన లక్షలాది మందిని రోజుల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. -సిటీబ్యూరో
రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఆయా పథకాలకు వెంటనే దరఖాస్తులు చేసుకోవాలని.. అర్హులందరికీ పథకాలు వర్తించేలా యుద్ధప్రాతిపదిక చేపడతామని హామీ ఇస్తున్నారు. ఎన్నికలు ముగియగానే కుక్క తోక వంకర అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలో వేలాది మంది పేదలు వంట గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కలెక్టరేట్ కార్యాలయం చుట్టూ రోజుల తరబడిగా తిరుగుతున్నారు. పనులు వదులుకుని ప్రజావాణితో పాటు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నా పథకాలను మాత్రం వర్తింపజేయడం లేదని వాపోతున్నారు.
నిత్యం వందలాది దరఖాస్తులు
గ్యాస్ సబ్సిడీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రతివారం లబ్ధిదారులు వందలాదిగా తరలివస్తున్నారు. ఈ రెండు పథకాల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినా.. క్యూ లైన్లు బారులు తీరి కనిపిస్తున్నాయి. గంటల తరబడిగా నిలబడి దరఖాస్తులు సమర్పిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి కలెక్టరేట్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నామని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో వేలాది మందికి రేషన్ కార్డు లేదని ఉచిత విద్యుత్ పథకానికి అర్హులు కారని తిరస్కరించారు.
ఇప్పుడు కొత్త రేషన్ కార్డులతో వచ్చినా నెలల తరబడిగా ఎదురు చూపులే మిగులుతున్నాయని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేషన్ కార్డు ఉండి, 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు బిల్లులు జత చేసినా..తమకు జీరో బిల్ రావడం లేదని వాపోతున్నారు. ఎన్నిసార్లు ఇచ్చినా దరఖాస్తులు తీసుకుంటున్నారని, పథకాన్ని మాత్రం అర్హులకు వర్తింపజేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు గ్యాస్ సబ్సిడీ నిలిచిపోయినవారు, కొత్తగా దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. ప్రజాపాలన అని చెప్పుకొంటున్న మంత్రులు, కాంగ్రెస్ నేతలు పథకాలను అర్హులకు అందజేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.
నాలుగుసార్లు దరఖాస్తు చేసిన..
నేను ఇండ్లండ్ల పని చేసుకుంటూ యూసుఫ్‌గూడలో భర్త ఇద్దరు పిల్లలతో ఉంటున్నా. నా భర్త దినసరి కూలీ. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి ఇప్పటికి నాలుగుసార్లు దరఖాస్తు చేసిన. మొదట నాకు రేషన్ కార్డు లేదని, ఉచిత విద్యుత్ పథకం వర్తించదని చెప్పినరు. కొత్త రేషన్ కార్డు వచ్చినాక కూడా మరో రెండు సార్లు దరఖాస్తు చేసుకున్నా. ప్రతిసారి వచ్చే నెల నుంచి జీరో బిల్ వస్తదని చెబుతున్నారు. కానీ ఇప్పటికీ బిల్లు చెల్లిస్తూనే ఉన్నాం. ఈసారైనా మాకు ఉచిత విద్యుత్ పథకం వర్తింపజేస్తరని ఆశిస్తున్నా.
– ఓ మహిళ, యూసుఫ్‌గూడ
