మునుగోడు, జనవరి 22 : కార్మిక చట్టాలను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నాలుగు కోడ్లను వెంటనే విరమించుకోవాలని సిఐటియు మునుగోడు మండల కన్వీనర్ వరుకుప్పల ముత్యాలు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 12న చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మేలో భాగంగా గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి మునుగోడు ఎంపీడీఓ గంగుల యుగంధర్ రెడ్డికి సిఐటియు సమ్మె నోటీసును గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సంబంధించిన 29 చట్టాలను రద్దుచేసి వాటి స్థానంలో నాలుగు కోడ్ లను చేసేందుకు గత సంవత్సరం నవంబర్ 21న ఇచ్చిన నోటిఫికేషన్ ను రద్దు చేయాలన్నారు.
విద్యుత్ సవరణ చట్టం 2025ను రద్దు చేసి, ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. జాతీయస్థాయిలో దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న ఒక్కరోజు సమ్మెకు మండలంలోని కార్మికులందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిఐటియు మండల సీనియర్ నాయకులు రెడ్డిమల్ల యాదగిరి, మండల అధ్యక్షులు పెరమళ్ల రాజీవ్, సైదులు, శ్రీకాంత్ పాల్గొన్నారు.