Border 2 | గల్ఫ్ దేశాల్లో భారతీయ చిత్రాలపై నిషేధం కొనసాగుతుండటం ఇప్పుడు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే రణవీర్ సింగ్ నటించిన బ్లాక్ బస్టర్ స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ సినిమాను గల్ఫ్ దేశాల్లో నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో పాకిస్థాన్‌ను ప్రతికూలంగా చూపించారనే నెపంతో యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్ వంటి దేశాలు ధురంధర్‌ను బ్యాన్ చేశాయి. దీంతో ఈ సినిమాకు రూ.100 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో చిత్రం చేరినట్లు తెలుస్తుంది. సన్నీ డియోల్ నటించిన దేశభక్తి చిత్రం ‘బోర్డర్ 2’ పై గల్ఫ్ దేశాలు నిషేధం విధించినట్లు వార్తలు వస్తున్నాయి. 1971 యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ‘బోర్డర్ 2’లో అతివాద జాతీయవాద అంశాలు ఉన్నాయని అక్కడి సెన్సార్ బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేశాయి. గల్ఫ్ దేశాల్లో పాకిస్థానీ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘ఫైటర్’, ‘టైగర్ 3’, ‘స్కై ఫోర్స్’ వంటి చిత్రాలకు కూడా ఇదే ఎదురుదెబ్బ తగిలింది. ఈ వరుస నిషేధాల పట్ల ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IMMPA) ఆందోళన వ్యక్తం చేస్తూ, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని ప్రధానమంత్రికి లేఖ రాసింది. ఈ ఆంక్షలు బాలీవుడ్ ఓవర్సీస్ మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.