దావోస్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో బోర్డ్ ఆఫ్ పీస్(Board of Peace) ఏర్పాటుపై ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ప్రపంచ దేశాధినేతలతో కలిసి ఆయన మీటింగ్ ఏర్పాటు చేశారు. బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటుపై గత ఏడాది ఆలోచన పుట్టింది. వాస్తవానికి గత సెప్టెంబర్‌లో గాజా యుద్ధం కోసం 20 సూత్రాల శాంతి ఒప్పందాన్ని ఆయన క్రియేట్ చేశారు. అయితే ఆ ప్లాన్‌కు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. ఆ ప్రణాళికకు యూఎన్ అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చింది. గాజా నుంచి మిలిటరీని వెనక్కి పంపేందుకు, ఆ పట్టణాన్ని మళ్లీ పునర్ నిర్మించేందుకు బోర్డ్ ఆఫ్ పీస్ అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే బోర్డ్ ఆఫ్ పీస్‌ను ఏర్పాటు చేశారు.
బోర్డ్ ఆఫ్ పీస్‌ను అంతర్జాతీయ సంస్థగా గుర్తిస్తున్నారు. సంక్షోభ ప్రదేశాల్లో స్థిరత్వం, శాంతి, సుపరిపాలన లక్ష్యంగా ఆ బోర్డును ఏర్పాటు చేయాలని ట్రంప్ భావిస్తున్నారు. ఆ బోర్డుకు నిరవధిక చైర్మెన్‌గా ట్రంప్ వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. ఆ బోర్డు క్రియేట్ చేసుకున్న తీర్మానం ప్రకారం ఆయన చాన్నాళ్లు ఆ పదవిలో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. బోర్డ్ ఆఫ్ పీస్‌లో అల్లుడు జేర్డ్ కుష్నర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఉండనున్నారు.
బోర్డ్ ఆఫ్ పీస్ ప్రతిపాదనకు యూఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్ట్, ఖతార్, బహరెయిన్, పాకిస్థాన్, టర్కీ, హంగేరీ, మొరాక్కో, కొసావో, అర్జెంటీనా, పరాగ్వే దేశాలు ఆమోదం తెలిపాయి. కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇండోనేషియా, వియత్నం దేశాలు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఆ బోర్డులో ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతన్యూ ఉన్నారు. అర్మేనియా, అజర్బైజాన్ కూడా అమెరికా ప్రతిపాదిత శాంతి ఒప్పందాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. బెలారస్ నేత అలెగ్జాండర్ లుకషెంకో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇప్పటికే సంతకం చేశారు. బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరేందుకు పుతిన్ అప్పుడే బిలియన్ డాలర్ల ఫీజు చెల్లించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిసింది. కొన్ని షరతుల ప్రకారం ఆ బృందంలో జతకలిసేందుకు కెనడా ప్రధాని మార్క్ కార్నే అంగీకరించారు. బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరేందుకు ఫ్రాన్స్, నార్వే దేశాలు వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. చైనాకు ఆహ్వానం వెళ్లింది. కానీ ఆ దేశం ఇంకా ఏమీ వెల్లడించలేదు. రష్యా మాకు శత్రువు కాబట్టి, ఆ బోర్డులో ఉండేది డౌటే అని జెలెన్స్కీ అన్నారు. బోర్డు మీటింగ్‌కు హాజరుకావడం లేదని ఇటలీ ప్రధాని మెలోనీ తెలిపారు.
ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్‌పై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆ బోర్డ్‌కు ట్రంప్ ఎంత కాలం పదవిలో ఉంటారన్న దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొత్త బోర్డు వల్ల యూఎన్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నట్లు కొందరు విమర్శిస్తున్నారు. సభ్యత దేశాలు పర్మనెంట్ సీటు కోసం బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. వసూల్ చేసిన నిధుల్ని గాజా పునర్ నిర్మాణానికి వినియోగించనున్నారు. బోర్డ్ ఆఫ్ పీస్ వల్ల ఐక్యరాజ్యసమితికి ఎటువంటి ప్రమాదం వాటిల్లదని ట్రంప్ అన్నారు. కానీ కొందరు నేతలు మాత్రం ఆ టెన్షన్లోనే ఉన్నారు. ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా బోర్డ్ ఆఫ్ పీస్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బోర్డ్ ఆఫ్ పీస్ సంతకాల సెర్మనీ దావోస్‌లో ఇవాళ జరిగింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం పరిస్థితులు చల్లబడుతున్నట్లు ఆయన చెప్పారు. ఏడాది క్రితం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అగ్నికణంలా ఉన్నాయని, చాలా మంది ప్రజలకు ఈ విషయం తెలియదని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపినట్లు దావోస్ వేదికగా మరోసారి ట్రంప్ పేర్కొన్నారు. అర్జెంటీనా ప్రెసిడెంట్ జావియర్ మిలే, హంగేరి ప్రధాని విక్టర్ ఓర్బన్ .. పేపర్లపై సంతకాలు చేశారు. ఐక్యరాజ్యసమితి విధివిధానాలనే ట్రంప్ ప్రతిపాదిత బోర్డ్ ఆఫ్ పీస్ నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు ముసాయిదా ద్వారా తెలుస్తోంది. గాజా యుద్ధం ముగింపు దశకు చేరుకున్నది, అక్కడ ఇప్పుడు స్వల్ప స్థాయి మంటలు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. ఐక్యరాజ్యసమితిపై తీవ్ర విమర్శలు చేస్తూనే దానితో కలిసి పనిచేస్తానని ట్రంప్ అన్నారు.