చౌటుప్పల్, జనవరి 22 : చౌటుప్పల్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 200 కోట్ల నిధులు తెచ్చానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం అవాస్తమని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఇక్కడ ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి శూన్యమని విమర్శించారు. తన పాలనా కాలంలోనే ఈ ప్రాంతానికి అధిక నిధులు తెచ్చినట్లు ఆయన తెలిపారు. తేని నిధులను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తానే తెచ్చినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. ఒకవేళ ఆయన నిధులు తీసుకొచ్చినది వాస్తవమే అయితే నిధుల జీఓ కాపీలను చూపించాలన్నారు. ఈ నిధులపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. గురువారం చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో అసంపూర్తిగా నిలిచిన వంద పడకల దావఖాన, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వంద పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాలు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగిన పనులే ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే ఇంతవరకు వాటి వైపు కూడా చూడడం లేదన్నారు. తన హయాంలోనే సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, స్మశాన వాటికలకు నిధులు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయినా వాటి పనులు కొన్ని ఇంకా పూర్తి కాలేదని అగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా లక్కారం లోద్దికుంటకు మూసి జలాలను తరలిస్తానని గెలవగానే మాట ఇచ్చి తప్పాడన్నారు. రైతులు డబ్బులు వేసుకుని, దివిస్ పరిశ్రమ పైసలిస్తేనే ఎమ్మెల్యే పనులు ప్రారంభించడానికి ముందుకొచ్చారని ఆయన స్పష్టం చేశారు. ఇన్ని రోజులు ఈ పనులు ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు.
ఫ్లై ఓవర్ పనులు ఆలస్యం అవ్వడంతో చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దుమ్ము, దూలికి వ్యాపారాలు నడుపుకునే పరిస్థితి లేదన్నారు. ఈ మున్సిపాలిటీ మంచినీటి కోసం అమృత్ పథకంలో భాగంగా రూ.25 కోట్ల నిధులు తన హయాంలో తెచ్చిన ట్యాంకుల నిర్మాణం పూర్తి కాలేదు అన్నారు. అంతేగాకుండా బెల్ట్ దుకాణాల బంద్ మాటలకే పరిమితమైందన్నారు. రాష్ట్రంలో ఒకలా ఎక్సైజ్ పాలసీ ఉంటే మునుగోడులో ఇంకోలా ఉంటుందా అని ఆయన ప్రశ్నించారు.