హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ): ఆయిల్‌పామ్ సాగు చేసే రైతులకు భారీ ఊరట లభించింది. పామాయిల్ దిగుమతిపై సుంకాన్ని భారీగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకు ఉన్నటువంటి 5.5 శాతం సుంకాన్ని ఏకంగా 27.5 శాతానికి పెంచింది. దీంతో పామాయిల్ దిగుమతులు తగ్గి.. స్థానికంగా రైతులు పండించే ఆయిల్‌పామ్ గెలల ధర పెరిగే అవకాశం ఉంటుంది. తద్వారా ఆయిల్‌పామ్ సాగు లాభసాటిగా మారనుంది. పామాయిల్‌పై దిగుమతి సుంకం పెంచడం వల్ల ప్రస్తుతం టన్నుకు రూ. 14,392గా ఉన్న ఆయిల్‌పామ్ గెలల ధర కనీసంగా రూ. 16,500 పైగా ధర పలికే అవకాశం ఉంటుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 2.03 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగులో ఉంది. ఇందులో 44,400 ఎకరాల ఆయిల్‌పామ్ పంటల నుంచి 2.80 లక్షల టన్నుల ఆయిల్ పామ్ గెలల దిగుబడి వస్తున్నది. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకం పెంచడం వలన 9,366 మంది ఆయిల్ పామ్ రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉంది. పామాయిల్ దిగుమతి సుంకం పెంపుపై కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌కు రాష్ట్ర మంత్రి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. గతంలో దిగుమతి సుంకం పెంచాలని కోరుతూ మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడంతోపాటు ఓసారి రాష్ర్టానికి వచ్చిన కేంద్ర మంత్రి శివరాజ్సింగ్చౌహాన్కు వినపతిపత్రం ఇచ్చారు. ఇప్పుడు సుంకం పెంపు నేపథ్యంలో ఈ అవకాశాన్ని రాష్ట్ర రైతులు సద్వినియోగం చేసుకుని, భారీగా పామ్ ఆయిల్ సాగు చేయాలని మంత్రి కోరారు.
కేసీఆర్ ముందుచూపు
మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ రైతులకు సాగు లాభసాటిగా మారింది. అంతర్జాతీయంగా పామాయిల్‌కు గల డిమాండ్‌ను గుర్తించిన కేసీఆర్ తెలంగాణ పెద్ద ఎత్తున ఆయిల్‌పామ్ సాగుకు ప్రణాళికలు రూపొందించారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు క్రమం తప్పకుండా భారీ ఆదాయం సమకూరుతుందని పదే పదే చెప్పారు. ఇందుకు అనుగుణంగా ఐదేండ్ల ప్రణాళికను తయారు చేసి ఏకంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగయ్యేలా చర్యలు తీసుకున్నారు. కేసీఆర్ తీసుకున్న చర్యలతో రాష్ట్రంలో 30వేల ఎకరాల్లో మాత్రమే సాగులో ఉన్నటువంటి ఆయిల్‌పామ్‌ను ఏకంగా 2.03 లక్షల ఎకరాలకు పెంచారు. ఇప్పుడు దిగుమతి సుంకం పెంపుతో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ గెలల ధర భారీగా పెరిగే అవకాశం ఉంది. నాడు కేసీఆర్ తీసుకున్న ముందుచూపు నిర్ణయంతో నేడు రైతులకు ఆయిల్‌పామ్ సాగు లాభాల సాగు మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.