న్యూఢిల్లీ, డిసెంబర్ 1: డిజిటల్ అరెస్టులకు సంబంధించిన కుంభకోణాలపై దేశవ్యాప్తంగా సమగ్ర దర్యాప్తు జరపాలని సీబీఐని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. అంతేగాక సైబర్ నేరాలకు పాల్పడిన వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసేందుకు కృత్రిమ మేధను(ఏఐ) ఎందుకు ఉపయోగించడం లేదని రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ)ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిజిటల్ అరెస్టులు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకరంగా పరిణమించాయి. తాము పోలీసులమని లేదా కోర్టు అధికారులమని లేదా ప్రభుత్వ దర్యాప్తు సంస్థల సిబ్బందిమని చెబుతూ సైబర్ నేరగాళ్లు బాధితులను ఆడియో లేక వీడియో కాల్స్ ద్వారా వేధిస్తున్నట్లు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బాధితులను డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించి డబ్బు వసూలు చేసేందుకు తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నట్లు అనేక చోట్ల ఫిర్యాదులు నమోదయ్యాయి. డిజిటల్ అరెస్టు కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐకి అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష పాలిత పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతో సహా అన్ని రాష్ర్టాలను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం కోరింది.
ఏఐ టెక్నాలజీ ఎందుకు వాడట్లేదు?
సైబర్ మోసాలకు సంబంధించిన కేసులలో నేరగాళ్లు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపచేసేందుకు ఏఐని లేదా మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీని ఎందుకు ఉపయోగించలేదో తెలియచేయాలని కోరుతూ ఆర్బీఐకి ధర్మాసనం నోటీసు జారీ చేసింది. హర్యానాకు చెందిన ఓ వృద్ధ జంట దాఖలు చేసిన ఫిర్యాదుపై నమోదైన ఎఫ్ఐఆర్పై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ప్రధానంగా వృద్ధులే సైబర్ నేరస్థులకు లక్ష్యంగా మారుతున్నారని, వారి కష్టార్జితాన్ని సైబర్ నేరస్థులు దోచుకుంటున్నారని తెలిపింది. డిజిటల్ అరెస్టు కేసులకు సంబంధించిన దర్యాప్తులో సీబీఐకి వివరాలు అందచేసి సహకరించాలని ఐటీ సంబంధిత సంస్థలను సుప్రీంకోర్టు ఆదేశించింది.
బ్యాంకు అధికారులపైనా దర్యాప్తు
సైబర్ నేరాల దర్యాప్తులో సీబీఐకి మరింత మెరుగ్గా సహకరించేందుకు అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు (యూటీ) ప్రాంతీయ, రాష్ట్ర సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రాలను నెలకొల్పాలని ధర్మాసనం సూచించింది. సైబర్ నేరాల కేసులపై తాము విచారణ చేపట్టడానికి ముందు కేంద్ర హోం వ్యవహారాలు, టెలికం శాఖ, ఆర్థిక శాఖ, ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖతో సహా వివిధ కేంద్ర మంత్రుల అభిప్రాయాలను సేకరించి తమ ఎదుట ఉంచాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం కోరింది. ప్రజలను మోసం చేయడానికి నేరస్థులు వాడుకుంటున్న నకిలీ బ్యాంకు ఖాతాల నిర్వహణలో వారికి సహకరిస్తున్న బ్యాంకు అధికారులపై కూడా దర్యాప్తు చేయాలని సీబీఐని ధర్మాసనం ఆదేశించింది.