హైదరాబాద్: పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణి దంపతుల హత్య కేసులో దర్యాప్తు బాధ్యతలను సీబీఐ (CBI) చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసింది. నిందితులుగా వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్ పేర్లను చేర్చింది. 2021, ఫిబ్రవరి 17న పెద్దపల్లి సమీపంలో వామనరావు దంపతులు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై నమోదైన కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ వామన్‌రావు తండ్రి గట్టు కిషన్‌రావు సుప్రీం కోర్టులో పిషన్ దాఖలు చేశారు. గత నెల 12న పిటిషనర్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించిన అత్యున్నత న్యాయస్థానం.. కేసును సీబీఐకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కేసు నమోదుచేసింది.
‘ఈ హత్య కేసులో కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రామగిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. అయితే ఈ కేసు దర్యాప్తును చేపట్టి తుది నివేదిక దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆగస్టు 12న ఆదేశించింది. దీంతో ఇప్పటికే రామగిరి పీఎస్‌లో నమోదైన ఎఫ్ఐఆర్ను అదే సెక్షన్ల కింద మంథని మండలం గుంజపడుగుకు చెందిన వెల్ది వసంతరావు, కుంట శ్రీనివాస్, అక్కపాక కుమార్లపై రీరిజష్టర్ చేసి విచారణ చేపడుతున్నాం’ అని సీబీఐ పేర్కొంది. కేసు దర్యాప్తు అధికారిగా ఇన్స్పెక్టర్ విపిన్ గహలోత్ వ్యవహరించనున్నారు.