హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): ఇటీవల సంభవించిన వరదలపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. నష్టపోయిన రైతులకు, ప్రజలకు మాత్రం పరిహారం ప్రకటించలేదు. మరణించిన వారి కుటుంబాలకు మాత్రం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు తప్ప.. పరిహారం పంపిణీకి సంబంధించి ఎలాంటి ఆదేశాలూ జారీచేయలేదు. అయితే, జరిగిన నష్టంపై మళ్లీ నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించాల్సిన సాయాన్ని పక్కనపెట్టి, కేంద్ర ప్రభుత్వ సాయంపై ఆరా తీశారు. గత సంవత్సరం వరదల సమయంలోనూ కేంద్రం నుంచి రావాల్సిన సాయం రాకపోవడంపై ఆరా తీశారు. ఈ విషయాన్ని తక్షణమే కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని అధికారులను ఆదేశించారు.
కానీ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం ఊసేత్తకపోవడం విమర్శలకు తావిస్తున్నది. వాస్తవానికి గత సోమవారం నుంచి కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వరదలతో తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, సిద్దిపేట జిల్లాలు పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో పంటలు, ఇండ్లు మునిగిపోయి ఆర్థికంగా తీవ్ర నష్టం జరిగింది. పరిహారం కోసం బాధిత ప్రజలు, రైతులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. అయితే సమీక్ష నిర్వహించిన సీఎం.. కనీసం తక్షణ సాయం కూడా ప్రకటించకపోవడం పట్ల బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
వారమైనా… నివేదికలు ఇవ్వలేదా ?
గత సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మంగళ, బుధవారాల్లో కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. చెరువులు, కుంటలు తెగిపోయాయి. రోడ్లు, రైలు పట్టాలు తెగిపోయాయి. గ్రామాలు జలమయమయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోగా.. కోట్ల రూపాయల విలువైన ఆర్థిక నష్టం జరిగింది. పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే.. ఇప్పటివరకు అధికారులు నష్టంపై నివేదికలు అందించకపోవడం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి శనివారం జరిగిన క్యాబినెట్ సమావేశంలో వరదలపై చర్చ జరిగినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తారని, ఆ లోపు నష్టంపై నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. మళ్లీ సోమవారం సమీక్ష తర్వాత కూడా నివేదికలు కోరడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వర్షాలు కురిసి వారం గడుస్తున్నా.. ఇప్పటివరకు నివేదికలు ఇవ్వలేదా? ఒకవేళ అధికారులు ఇవ్వకుంటే.. ప్రభుత్వం ఎందుకు తెప్పించుకోలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి, ఇప్పటికే వరద నష్టంపై నివేదికలు సిద్ధమైనట్టుగా తెలిసింది. సుమారు 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అదేవిధంగా 1,023 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్టు ఆర్ అండ్ బీ శాఖ సీఎంకు వివరించింది. నష్టం వివరాలు తెలిసినప్పుడు.. పరిహారం ఎందుకు ప్రకటించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తక్షణ సాయమేదీ.. కేంద్రానికి నివేదికలేవీ?వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం అప్పటికప్పుడు వరద నష్టాన్ని అంచనా వేసి, ప్రజలకు తాత్కాలిక ఉపశమనం కోసం తక్షణ సాయాన్ని ప్రకటిస్తుంది. నష్టంపై కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించి.. సాయాన్ని కోరుతుంది. కానీ, కాంగ్రెస్ సర్కారు.. ఇందులో ఏ ఒక్క పని కూడా చేసినట్టు కనిపించడం లేదు. వరద నష్టాన్ని అంచనా వేయలేదు. ప్రజలకు తక్షణ సాయాన్ని ప్రకటించలేదు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలే పంపలేదు.