హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లకు మార్గం సుగమమైంది. స్థానికతకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.33ను సుప్రీంకోర్టు సమర్థించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. మెడికల్ అడ్మిషన్లకు సంబంధించి 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు వరుసగా నాలుగేండ్లపాటు తెలంగాణలో చదివిన విద్యార్థులను మాత్రమే స్థానికులుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిరుడు జీవో 33ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి వరకు తెలంగాణలో చదివి, ఇతర కారణాల వల్ల బయటి రాష్ర్టాల్లో ఇంటర్ చదివిన తాము నష్టపోతున్నామంటూ పలువురు తెలంగాణ విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. తెలంగాణలో శాశ్వత నివాసం ఉన్నవారిని స్థానికులుగా గుర్తించాలని నిరుడు సెప్టెంబర్‌లో ఆదేశించింది. రెండేండ్లు బయట చదివినంత మాత్రాన స్థానికులు కాదనడం సబబు కాదని స్పష్టంచేసింది. వారికి కౌన్సెలింగ్‌కు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. స్థానిక కోటాకు సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్చంద్రన్తో కూడిన ధర్మాసనం విచారణ జరిపి సోమవారం తీర్పు వెలువరించింది. ప్రభుత్వం జారీచేసిన జీవో 33ను సమర్థించింది. మూడో నిబంధనలో చేయబోతున్న మార్పుల పట్ల ధర్మాస నం సంతృప్తి వ్యక్తంచేసింది. బయటి రాష్ర్టాల్లో 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివినవారికి నాలుగు రకాల వెసులుబాట్లను కల్పిస్తామని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
ఇతర రాష్ర్టాల్లో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలను స్థానికులుగా గుర్తిస్తామని పేర్కొన్నది. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆలిండియా సర్వీసెస్ (ఏఐఎస్)అధికారులు, రిటైర్డ్ ఏఐఎస్‌లు ఇతర రాష్ర్టాల్లో పనిచేస్తున్న/పనిచేసినవారి పిల్లలకు అవకాశం ఇస్తామని వెల్లడించింది. తెలంగాణ ప్రాంతానికి చెందినవారై ఉండి రక్షణ రంగం లో, కేంద్ర సాయుధ బలగాల్లో పనిచేస్తున్న/పదవీ విరమణ చేసిన అధికారులు ఇతర రాష్ర్టాల్లో విధులు నిర్వహిస్తుంటే వారి పిల్లలను స్థానికులుగా పరిగణిస్తామని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులై ఉండి విధి నిర్వహణలో ఇతర రాష్ర్టాలకు బదిలీ అయినవారి పిల్లలను కూడా స్థానికులుగా గుర్తిస్తామని వివరించింది. ఈ వెసులుబాట్ల ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ధర్మాసనం జీవో 33ను సమర్థిస్తూ ఆదేశాలు వెలువరించింది. గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసింది. నిరుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం స్థానిక కోటాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులను కొనసాగించాలని సూచించింది. సుప్రీం తీర్పుపై నీట్ పేరెంట్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. అధ్యక్షుడు సత్యనారాయణచారి, ప్రధానకార్యదర్శి రమేశ్‌కుమార్ సంతోషం వ్యక్తంచేశారు.