మహబూబ్‌నగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కాంగ్రెస్ పార్టీలో ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో నేతల వ్యవహారం తలో‘చేయి’గా మారింది. ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించినా.. అభ్యర్థుల ఎంపికకు ఇంకా కసరత్తు కొనసాగుతున్నది. దీంతో పార్టీలో రోజురోజుకూ ఆశావహులు పెరుగుతున్నారు. టికెట్ వస్తుందో.. లేదో అన్న మీమాంసలో వారికున్న మార్గాల్లో లాబీయింగ్‌కు పాల్పడుతున్నారు. ముందుగానే నాకంటే.. నాకంటూ.. నేతలు ప్రచారం చేస్తుండడంతో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. అయితే ముందు నుంచి పార్టీని నమ్ముకొని నేతలను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన జంప్ జిలానీలకు సీట్లు కేటాయిస్తారన్న వార్తలతో భగ్గుమంటున్నారు. టికెట్లు లోలోపలే అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధిష్టానం తీరుపై నాగం జనార్దన్‌రెడ్డి భగ్గుమనగా.. టికెట్ కేటాయించకుంటే కొల్లాపూర్ నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని జగదీశ్వర్‌రావు అల్టిమేటం జారీ చేశారు. మక్తల్, నారాయణపేట, గద్వాల టికెట్లు స్థానికులకు, పాలమూరు నుంచి బీసీలకు ఇవ్వాలని శ్రేణులు పట్టుబట్టాయి. ఆశించిన స్థాయిలో టికెట్ల కేటా‘యింపుగా’ లేకుంటే పార్టీని నమ్ముకున్న వారంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇలా కాంగ్రెస్‌లో టికెట్ల కోసం కుంపటి రగులుతున్నది.
కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి తారాస్థాయికి చేరింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినా ఇంకా టికెట్లు వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో నేతల్లో అసహనం పెరుగుతున్నది. టికెట్లు దక్కుతాయే లేదో అన్న టెన్షన్ నేతలకు పట్టుకున్నది. టికెట్లు కేటాయింపులో అస్పష్టత వస్తుండడం.. సీనియర్లకు టికెట్లు గల్లంతు అవుతాయనే ప్రచారంతో కార్యకర్తలకు సర్దిచెప్పలేకపోతున్నారు. పార్టీని నమ్ముకున్న నేతలకు హ్యాండ్ ఇస్తున్నారన్న సంకేతాలతో ఏకంగా ఢిల్లీ, హైదరాబాద్ వేదికగా ధర్నాలు, నిలదీతలు కామన్‌గా మారిపోయాయి. గద్వాలకు చెందిన నేతలు ఏకంగా దేశ రాజధానిలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. టికెట్ అమ్ముకున్నారని బహిరంగంగా ఆరోపణలు గుప్పించడంతో ఖంగుతిన్నారు. కొల్లాపూర్‌లో టికెట్ తనకే కేటాయించకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని సీనియర్ కాంగ్రెస్ నేత జగదీశ్వర్‌రావు హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా నాగర్‌కర్నూల్‌లో మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి చక్రం తిప్పుతా.. నేనేంటో నిరుపిస్తా.. అంటు శపథం చేశాడు. నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు వాకిటి శ్రీహరికి మద్దతుగా మక్తల్‌లో ఆయన ఇంట్లో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. టికెట్ ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అంతకుముందు నారాయణపేటలో కూడా టికెట్ శివకుమార్‌రెడ్డికి ఇవ్వాలంటే కార్యకర్తలు డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్‌లో బీసీలకు టికెట్ కేటాయించాలని ఏకంగా పార్టీ కార్యాలయం ముందు శ్రేణులు ధర్నాకు దిగారు. వనపర్తి టికెట్‌ను మాజీ మంత్రి చిన్నారెడ్డికి ఇవ్వకుంటే పార్టీ చిన్నాభిన్నం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకున్న నేతలకు టికెట్లు రాకుంటే మూకుమ్మడి రాజీనామా చేస్తామని హెచ్చరికలు చేస్తున్నారు. ఇంకా టికెట్లు ఖరారు కాకపోవడంతో రోజుకో పేరు తెరమీదకు వస్తుండటంతో నేతల్లో అయోమయంలో ఉండగా.. కార్యకర్తలు మాత్రం అసహనానికి గురవుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో టికెట్లు తమకే వస్తాయని.. హైకమాండ్‌ను మామూలుగా మేనేజ్ చేయలేదని, జడ్చర్ల, గద్వాల, మహబూబ్‌నగర్, కొల్లాపూర్ ఆశావహులు అంటుండటంతో పార్టీలో రెండు వర్గాల మధ్య సిగపట్లు తప్పడం లేదు.
నా తడాఖా చూపిస్తా.. : నాగం అల్టిమేటం
నాగర్‌కర్నూల్‌లో తన కుటుంబం కోసం పార్టీని సర్వనాశనం చేస్తున్న ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్‌రెడ్డికి పార్టీ టికెట్ ఇస్తారా? అంటు నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నిస్తున్నారు. నాగర్‌కర్నూల్‌లో ఆయన తన అనుచరులతో భారీ ఎత్తున సమావేశమయ్యారు. ఎంతో సీనియర్‌ను గత ఎన్నికల్లోనూ పార్టీ తరఫున పోటీ చేశా.. ఓడిపోయా.. ఈ ఐదేళ్లు బీఆర్ఎస్ను ఢీకొని పార్టీని బతికించిన తనకు టికెట్ ఇవ్వకుంటే నా తడాఖా ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. ఆయనేమన్నా పార్టీకోసం టికెట్ అడుగుతున్నాడా? తన కుటుంబం కోసం పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ధ్వజమెత్తడం నాగర్‌కర్నూల్‌లో చర్చనీమాంశంగా మారింది. నాగం సమావేశం నిర్వహించాక కూచుకుళ్ల వర్గీయులకు ముచ్చెమటలు పట్టాయి. కొల్లాపూర్‌లో కూడ సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. పార్టీలు మారుతున్న జూపల్లికి టికెట్ ఇస్తే తాను ఇండిపెండెంట్‌గా పోటీకి దిగడం ఖాయమని కాంగ్రెస్ నేత జగదీశ్వర్‌రావు అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చారు. పార్టీ మారినంత మాత్రాన టికెట్ ఇస్తారా? అంటూ ప్రశ్నించారు. పార్టీ ప్రయోజనాలను ఢిల్లీ పెద్దలు కాపాడాలని.. పార్టీని రక్షించాలని కార్యకర్తలు కోరుతుండటం గమానార్హం.
టికెట్లు అమ్ముకున్నారంటూ గద్వాల నేతల లొల్లి
గద్వాల పార్టీ టికెట్‌ను ఇటీవల బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఓ నేతకు అమ్ముకున్నారని ఓ ఆడియో క్లిప్ వైరల్‌గా మారింది. మా మేడంకు టికెట్ ఖాయం.. అంతా మేనేజ్ చేసుకున్నాం.. డబ్బులు ఇచ్చినం.. మాకే టికెట్ వస్తుందని ఇద్దరు కార్యకర్తలు మాట్లాడుకున్నట్లు ఉన్న ఆడియో క్లిప్ కాంగ్రెస్ నేతలకు ముచ్చెమటలు పట్టించింది. దీంతో పార్టీ టికెట్ ఆశిస్తున్న విజయ్‌కుమార్ ఏకంగా ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం వార్‌రూమ్ ముందు ధర్నాకు దిగారు. అంతేగాక టీపీసీసీ చీఫ్ రేవంత్‌ను నిలదీయడంతో ఖంగుతిన్నారు. దీంతో ఈ వ్యవహారం మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వనపర్తిలో కూడా మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాదని టికెట్‌ను బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఓ కాంట్రాక్టర్‌కు కట్టబెడుతున్నారనే ప్రచారం కూడా ఆరోపణలకు తావిస్తోంది. ఈ టికెట్‌ను కోట్లకు అమ్ముకున్నారని కార్యకర్తలే బాహాటంగా గుసగుసలాడుతున్నారు. అక్కడ గెంటితే ఇక్కడకు వచ్చిన సదరు నేతకు టికెట్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో కూడ బీసీలకు టికెట్లు ఇవ్వకుండా బీజేపీ నుంచి వచ్చిన ఓ అగ్రవర్ణ నేతకు టికెట్ ఇస్తే సహకరించమని.. బీసీ నేతలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ కార్యాలయం ముందు శ్రేణులు బైఠాయించాయి. మక్తల్‌లో బీసీ నేత వాకిటి శ్రీహరికే టికె ట్ ఇవ్వాలని కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కల్వకుర్తిలో తనను కాదని ఇటీవల పార్టీ మారి న బీఆర్ఎస్ నేతకు ఇవ్వడం ఏమిటని ఆ పార్టీ ఎన్ఆర్ఐ స్టేట్ ప్రెసిడెంట్ నిలదీస్తున్నారు. కాంగ్రెస్‌లో టికెట్ల కోసం సిగపట్లు పడుతుండటంతో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు.
టికెట్లపై కాంగ్రెస్‌లో ఆరని మంటలు
ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల యుద్ధం తారాస్థాయికి చేరింది. చాలామంది ఏండ్ల తరబడి పార్టీని నమ్ముకున్న వారిని కాదని పార్టీలు మారిన వారికి టికెట్లు కేటాయిస్తున్నట్లు వస్తున్న సంకేతాలతో తీవ్ర అసహనం వ్యక్తమవుతున్నది. టికెట్లు ప్రకటిస్తే ఇంకా ఎన్ని ఆందోళనలు లేవదీస్తారో అని నేతలే అంటున్నారు.పార్టీ టికెట్లు ప్ర జాభిష్టం మేరకు ఇవ్వకుంటే పార్టీకి సర్వనాశనం తప్పదని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. ఇంకా టికెట్లు ప్రకటించడానికి ఎంత సమయం పడ్తుందని నిలదీస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న ది. టికెట్ల వ్యవహారంలో నాన్చివే త ధోరణి మంచిదికాదని సూచిస్తున్నా రు. ఈ సంస్కృ తి ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తుతున్నారు.