Congress Govt | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్ర నేతల్లో ఈ వారంలోనైనా విస్తరణ ఉంటుందా లేదానన్న సదేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈసారి కూడా మంత్రివర్గ విస్తరణ లేనట్టేనని, మరికొన్ని రోజుల సమయం పట్టేటట్టు ఉందని గాంధీభవన్ నుంచి లీకులు అందుతున్నాయి. పదవుల పందేరంలో అసలు కాంగ్రెస్, వలస కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవటం, ఒక బెర్తు కోసం ఆరుగురు రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతలు పట్టుబట్టడమే ఆలస్యానికి కారణమని ప్రచారం జరుగుతున్నది. సీఎం రేవంత్‌రెడ్డి జైపూర్ నుంచి గురువారం ఢిల్లీ చేరుకున్నారు. రోజుంతా ఎదురుచూసినా ఆయనకు రాహుల్‌గాంధీ అయిపాయింట్మెంట్ దొరకలేదని తెలిసింది. దీంతో ఆయన కేంద్ర మంత్రులను కలిసినట్టు సమాచారం. రాహుల్‌గాంధీ అపాయింట్మెంట్ శుక్రవారం కూడా లభించకపోతే.. మరి కొంతమంది కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
మంత్రివర్గ కూర్పుపై అధిష్ఠానం సూచనల మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే పలు దఫాలు సీనియర్ కాంగ్రెస్ నేతలతో కలిసి మాట్లాడినప్పటికీ ఏకాభిప్రాయం కుదరనట్టు తెలిసింది. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఎంపిక విషయంలో తీవ్ర తర్జనభర్జన జరిగినట్టు తెలిసింది. పార్టీ కోశాధికారిగా ఉన్న ఆ నేతకు మంత్రి పదవి ఇవ్వాలని ఇద్దరు అసలు కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నట్టు సమాచారం. ఇది ముఖ్యనేతకు ఇష్టం లేదని అంటున్నారు. సీఎల్పీ నేతగా ముఖ్యనేతను ఎన్నుకునే సమయంలో సదరు కోశాధికారి తీవ్రంగా వ్యతిరేకించినట్టు తెలిసింది. దాన్ని మనుసులో పెట్టుకున్న ముఖ్యనేత ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి రాకుండా అడ్డంపడుతున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వెలమ సామాజికవర్గం నుంచి ఇప్పటికే ఒకరికి మంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో రెండో సీటు మళ్లీ అదే వర్గానికి ఇవ్వాల్సిన అవసరం లేదని ముఖ్యనేత వాదిస్తున్నట్టు సమాచారం.
ఒక మంత్రి పదవి బీసీలకు దక్కునుండగా, దానిని ముదిరాజుల సామాజికవర్గానికి ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలిసింది. ముదిరాజుల కోటా కింద ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ముదిరాజ్ ఎమ్మెల్యే పేరును అసలు కాంగ్రెస్ నేతలు ప్రతిపాదించగా.. ముఖ్యనేత విముఖత చూపినట్టు సమాచారం. బీసీలలో మరో పెద్ద కులమైన మున్నూరు కాపు నేతకు అవకాశం ఇద్దామని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వలస కాంగ్రెస్ నేత పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. దీన్ని అదే జిల్లాకు చెందిన అసలు కాంగ్రెస్ బ్యాచ్ తీవ్రంగా వ్యతిరేకించినట్టు సమాచారం.
ఇక ఎస్సీ సామాజికవర్గం నుంచి మాల, మాదిగ వర్గాలు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే మాలలు హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ పెట్టి తమ సత్తా చాటగా.. మాదిగలు వర్గీకరణ అంశంతో నరుక్కొస్తున్నారు. మాల సామాజిక వర్గం నుంచి ఒక మంత్రి ఉండగా.. మాదిగల నుంచి ఎవరూ లేరని కాంగ్రెస్‌లోని ఆ వర్గం వాదిస్తున్నది. అయితే ఎస్సీ సామాజిక వర్గం నుంచి అదిలాబాద్ జిల్లాకే చెందిన ఇద్దరు సోదరుల్లో ఒకరికి ఇవ్వవచ్చనే ప్రచారం జరుగుతున్నది. హైదరాబాద్ నుంచి ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ పేరును తెరమీదికి తెచ్చినట్టు సమాచారం. కాగా ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఎస్టీ నేతకు మంత్రి ఇస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తున్నట్టు తెలిసింది. నాగర్జున సాగర్ ప్రాంతానికి చెందిన అసలు కాంగ్రెస్ నేత కూడా ఓ గిరిజన నాయకుని పేరునే సూచించినట్టు సమాచారం.