KTR | అచ్చంపేట : అచ్చంపేట నియోజకవర్గ ప్రజలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. మంత్రులకు సోయి లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు కానీ అచ్చంపేట బిడ్డలకు మాత్రం తెగువ ఉందని కేటీఆర్ అన్నారు. అచ్చంపేటలో బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన జన గర్జన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్లో మాట్లాడుతూ.. నేను గెలుస్తనో, గెల్వనో నాకే తెల్వదు.. ఈ ప్రభుత్వం వస్తదో రాదో తెల్వదు.. కాబట్టి నేను మాట ఇవ్వను అని చెప్పారు. జూపల్లి మాటలను చూసి మేం నవ్వుకున్నాం. జూపల్లికి తెలియకపోవచ్చు.. అచ్చంపేట బిడ్డలకు తెలుసు.. కాంగ్రెస్ ప్రభుత్వం రాదని. తిరిగి కేసీఆర్ వస్తారని నల్లమల్ల బిడ్డలకు తెలుసు. మంత్రులకు సోయి లేకపోవచ్చు, తెలివి లేకపోవచ్చు కానీ అచ్చంపేట బిడ్డలకు మాత్రం తెగువ ఉంది కాబట్టి ఈ దుర్మార్గం కాంగ్రెస్ రావొద్దని కోరుకుంటున్నారని కేటీఆర్ తెలిపారు.
మీ నియోజకవర్గంలో ఇక్కడ పుట్టిన ఓ వ్యక్తి రాష్ట్రానికి సీఎం ఉన్నాడు. ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లె వంగూరు మండలం.. ఆ మీదికేంచి వచ్చాను. ఆ ఊరిలో గానీ రేవంత్ గురించి చెప్తరు అనుకున్నా.. రేవంత్ రోజుకో తీరు మాట్లాడుతాడు.. పేద రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి కేసీఆర్కు నచ్చట్లేదని మాట్లాడుతాడు.. నేను వ్యవసాయం చేయలేదు.. మా తాత పోలీసు పటేల్ అని చెప్తాడు.. మా తాత, తండ్రి మస్తు వ్యవసాయం చేసిండ్రు అని మరోసారి చెప్తడు. మొత్తంగా ఆయనలో అపరిచితుడు దాగి ఉన్నాడు.. పొద్దున రాము.. సాయంత్రం రెమోలా తయారవుతున్నాడు. ఆయన మాటలు వింటుంటే రాష్ట్రం పరువు పోయేలా ఉన్నాయి. ఆయన పుట్టిన గడ్డ అచ్చంపేట నుంచి జైత్రయాత్ర మొదలుపెట్టాలని జనగర్జన పెట్టుకున్నాం. మిమ్మల్ని చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడగడానికి వస్తే బుద్ధి చెప్తారన్న విశ్వాసం కలుగుతుంది అని కేటీఆర్ పేర్కొన్నారు.