TG Weather | తెలంగాణలో రాగల రెండురోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది. పశ్చిమ విదర్భ, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం దాదాపు పశ్చిమ దిశకు కదిలి అల్పపీడనంగా బలహీనపడిందని వాతావరణశాఖ పేర్కొంది. ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 7.6కిలోమీటర్ల వరకు విస్తరించి నైరుతి వైపునకు ఎత్తుకు వంగి ఉందని.. ఇది రాబోయే 24గంటల్లో బలహీనపడుతుందని తెలిపింది. ఆదివారం నుంచి మంగళవారం మధ్య మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్, సౌరాష్ట్ర మీదుగా పశ్చిమం వైపు కదులుతూ అక్టోబర్ ఒకటి నాటికి గుజరాత్ తీరం వెంబడి ఈశాన్య అరేబియా సముద్రం మీదుగా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. సెప్టెంబర్ 30న ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో అక్టోబర్ ఒకటిన ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ క్రమంలో తెలంగాణలో ఆదివారం వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉంటుందని.. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అంచనా వేసింది. ఉదయం, రాత్రి సమయాల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులు నెలకొనే సూచనలున్నాయని చెప్పింది.