హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) ఆవిషరణలను అంతర్జాతీయ వేదికకు తీసుకెళ్లిన సిరిసిల్ల బిడ్డ, గ్రావ్టన్ మోటార్స్ వ్యవస్థాపకుడు పరశురామ్ పాకను బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు అభినందించారు. ఒక ఆవిషర్తకు ప్రేరణనిచ్చే ఎకో సిస్టం లభించినప్పుడు అద్భుతాలు జరుగుతాయని తెలిపారు. పరశురామ్ వంటి ప్రతిభావంతులను పోషించడంలో తెలంగాణలోని ఆవిషరణల కేంద్రాలైన టీ-హబ్, టీ-వర్స్ పాత్ర కీలకమని ఆదివారం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘సిరిసిల్లకు చెందిన పరశురామ్ ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణ.
ఇంజినీరింగ్ నేపథ్యం, అమెరికాలో అనుభవం ఉన్న పరశురామ్.. మన ఇంక్యుబేటర్లు టీ-హబ్, టీ-వర్క్స్ వద్ద ఉన్న అత్యాధునిక సౌకర్యాలను ఉపయోగించుకుని గ్రావ్టన్ మోటార్స్‌ను స్థాపించారు. నేడు ఈ సంస్థ తెలంగాణ నుంచే ప్రపంచస్థాయి ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్లను తయారుచేస్తున్నది’ అని కేటీఆర్ వివరించారు. గ్రావ్టన్ మోటా ర్స్ తమ మోటార్లు, బ్యాటరీలు, కంట్రోల్ సిస్టమ్స్‌ను పూర్తిగా దేశీయంగా రూపొందించి, తయారుచేసిందని తెలిపారు. ఇది నిజమైన ‘మేడ్-ఇన్-ఇండియా, మేడ్ ఫర్ ది వరల్డ్’ విజయగాథ అని అభివర్ణించారు.
గతంలో గ్రావ్టన్ మోటార్స్ సంస్థ నాలుగు వేల కిలోమీటర్ల కశ్మీర్-టు-కన్యాకుమారి (కే2కే) రైడ్‌ను పూర్తిచేసి ప్రపంచ రికార్డును నెలకొల్పిందని కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఈ కంపెనీ కెన్యా, ఫిలిప్పీన్స్, పెరూ వంటి దేశాలకు తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు పేర్కొన్నారు. కోయంబత్తూర్‌లో శుక్రవారం పరశురామ్‌ను కలిశానని, వారి కంపెనీ ప్రయాణం, విజయాలు తనను ఎంతగానో ప్రేరేపించాయని కేటీఆర్ తెలిపారు.
‘ఇది నాకు నిజంగా అవసరమైన ఎనర్జీ బూస్టర్. పరశురామ్, గ్రావ్టన్ మోటార్స్ ఈవీ బృందానికి అభినందనలు. మీ కథ మరెందరికో స్ఫూర్తినివ్వాలని కోరుకుంటున్నాను’ అని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిషరణల వ్యవస్థ స్థానిక మేధస్సును అంతర్జాతీయ ప్రభావిత శక్తిగా మారుస్తూ, భారతదేశ ఈవీ విప్లవాన్ని ఎలా ముందుకు నడిపిస్తున్నదో ఈ విజయాలు నిరూపిస్తున్నాయని తెలిపారు.