బీహార్‌లో బీజేపీ ఓట్ చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గొంతుచించుకుంటున్న వేళ.. తెలంగాణలోనూ ఓట్ చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో దొంగ ఓట్లు బయటపడటం విస్మయానికి గురిచేస్తున్నది. కాంగ్రెస్ నేతల సన్నిహితుల ఇండ్లలో పదుల సంఖ్యలో బోగస్ ఓట్లు బయటపడ్డాయి. అపార్ట్మెంట్లు, పేయింగ్ గెస్ట్ హాస్టళ్లలో భారీ మొత్తంలో బోగస్ ఓట్లు సృష్టించినట్టు సమాచారం. ఒక్కో ఇంట్లో 40కి పైగా ఓట్లు ఉన్నట్టు ఆధారాలు బయటపడటం కలకలం రేపుతున్నది.
హైదరాబాద్ సిటీ బ్యూరో, బంజారాహిల్స్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్ బీ-బ్లాక్‌లో బూత్ నంబర్ 246లోని ఓటరు జాబితాను బీఆర్ఎస్ బూత్ ఇన్చార్జీలు పరిశీలించారు. ఆ జాబితా ప్రకారం ఓటర్లు ఉన్నారా? లేరా? అని తెలుసుకునేందుకు సంస్కృతి అవెన్యూ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. 8-3-231/బీ/160 నంబర్‌తో ఉన్న ఆ అపార్ట్మెంట్లో నూతన ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 43 మంది ఓటర్లున్నారు. వారంతా అపార్ట్మెంట్లో నివసిస్తున్నారా? లేరా? అని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఓటరు జాబితాలోని ఓటర్ క్రమసంఖ్య 1006 నుంచి 1048 వరకు ఉన్న 43 మందిలో ఇద్దరు తప్ప మిగిలిన వారెవరూ అక్కడ లేరని తేలింది.
ఐదు అంతస్తులతో ఉన్న ఆ అపార్ట్మెంట్లో మొత్తం 15 ఫ్లాట్లు ఉండగా వాటిలో మూడు ఫ్లాట్లు ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉన్నాయి. మరో 12 ఫ్లాట్లలో ఉంటున్నవారిని వాకబు చేయగా తాము సంవత్సర కాలం నుంచి ఇక్కడే ఉంటున్నామని చెప్పారు. వారిలో కొంతమంది ఓట్లు ఏపీలో ఉన్నాయని, మరికొందరు తమకు వేరే నియోజకవర్గాల్లో ఓట్లు ఉన్నాయని తెలిపారు. మిగతా వారు గతంలో అక్కడ నివసించి ఉంటారని అనుకుంటే, ఆ అపార్ట్మెంట్ కట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. ప్రస్తుతం ఉన్నవారే మొదటి నుంచీ అక్కడ ఉంటున్నట్టు తేలింది. అపార్ట్మెంట్ స్థానంలో గతంలో ఒక చిన్న ఇల్లు మాత్రమే ఉండేదని, అందులో 40 మందికి పైగా ఉండే అవకాశమే లేదని స్థానికులు చెప్తున్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తే సంచలన విషయాలు బయటపడ్డాయి. కాంగ్రెస్ అభ్యర్థి సన్నిహితుల చిరునామాతో వేరే ప్రాంతాల్లో ఉంటున్న కొందరిని ఓటరు జాబితాలో చేర్చినట్టు తెలిసింది. కొత్తగా చేర్చినవారిలో ఎక్కువ మంది సినీ పరిశ్రమలో కార్మికులు, వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నవారు ఉన్నారని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. పదిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నవీన్‌యాదవ్ ఓటర్ కార్డులు పంపిణీ చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అక్కడ పంపిణీ చేసిన ఓటర్ కార్డులు నవీన్‌యాదవ్ కార్యాలయంలో దరఖాస్తు చేసినవేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
యూసుఫ్‌గూడలోని కృష్ణానగర్ బీ బ్లాక్, ఏ-బ్లాక్‌లతోపాటు యూసుఫ్‌గూడ బస్తీ, వెంగళ్రావునగర్ డివిజన్ పరిధిలోని యాదగిరినగర్, జవహర్‌నగర్ తదితర బస్తీల్లో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదు చేయించారని సమాచారం. బస్తీల్లో బహుళ అంతస్తుల భవనాలు ఉండడం, ఒక్కో భవనంలో 10నుంచి 15 కుటుంబాలు నివాసం ఉండడంతో వాటినే లక్ష్యంగా చేసుకుని ఎక్కువమంది ఓటర్లున్నా ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో భారీగా కొత్త ఓటర్లను నమోదు చేయించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇవన్నీ కాంగ్రెస్ నాయకుల కనుసన్నల్లో జరిగినట్టు బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.
రౌడీషీటర్ మంగళారపు అర్జున్‌యాదవ్ కుటుంబానికి చెందిన ఓ ఇంటి చిరునామా మీద 49 ఓట్లు ఉన్నాయని తేలింది. ఈ భవనంలో ఎన్నో సంవత్సరాలుగా ఒక హాస్టల్ కొనసాగుతున్నది. రౌడీషీటర్ అర్జున్‌యాదవ్ సోదరుడు కొన్నేళ్లుగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌కు సన్నిహితుడిగా ఉన్నారు. తాజాగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో సైతం చురుగ్గా పాల్గొంటున్నారు. 8-3-231/బీ/118 ఇంటి నంబర్ కలిగిన జీ ప్లస్ 3 భవనంలో ఏకంగా 49 ఓట్లున్నాయని తేలడంతో స్థానికులు షాక్‌కు గురవుతున్నారు. 246 బూత్‌లోని ఓటర్ క్రమసంఖ్య 732 నుంచి 777 వరకు 46 ఓట్లు, 871 నుంచి 873 దాకా మరికొన్ని ఓట్లు ఉన్నాయి. వీరిలో సుమారు 40 మందికి పైగా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వారు కారని తేలింది.
బోగస్ ఓట్ల నమోదులో బీఎల్వోల పాత్ర కీలకంగా ఉన్నట్టు సమాచారం. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బీఎల్వోలు పరిశీలించాల్సి ఉంటుంది. దరఖాస్తుదారుల ఇంటికి వెళ్లి దరఖాస్తుదారుడు అక్కడున్నారా? లేరా? అనే విషయాన్ని నిర్ధారించుకోవాలి. వారి ఆధార్ కార్డులు, కరెంట్ బిల్లు పరిశీలించాల్సి ఉంటుంది. అయితే అధికార కాంగ్రెస్ పెద్దల నుంచి ఒత్తిడి తెచ్చిన స్థానిక కాంగ్రెస్ నేతలు బీఎల్వోల ద్వారా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే దొంగ ఓట్లను నమోదు చేయించారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఎల్వోలకు డబ్బులు ఎరగా వేయడంతో సుమారు 3 వేల దాకా దొంగ ఓట్లను నమోదు చేయించారని స్థానిక నేతలు భావిస్తున్నారు.