ఈ ప్రభుత్వం ఒక ఇల్లూ కట్టలేదు. ఒక ఇటుకా పెట్టలేదు. కానీ రెండు లక్షల 30 వేల కోట్ల అప్పులు చేసింది. గరీబోళ్ల ఇండ్లు ఎకడుంటే అకడికి రేవంత్‌రెడ్డి బుల్డోజర్లు పంపించి కూలగొట్టిస్తున్నడు. జూబ్లీహిల్స్ ఎన్నికలో కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు చేయకపోతే ఇంకా రెచ్చిపోతడు.
-కేటీఆర్
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): కారు కావాలో, బుల్డోజర్ కావాలో జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు విజ్ఞప్తిచేశారు. ప్రజావికాసానికి, అభివృద్ధికి కారు సంకేతమైతే, విధ్వంసానికి, వినాశనానికి బుల్డోజర్ ఉదాహరణ అని చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఒక్క ఇటుక పేర్చలేదు కానీ, పేదల ఇండ్లను మాత్రం ఈ కాంగ్రెస్ సర్కారు కూల్చివేస్తున్నదని విమర్శించారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ రాకుండా సురుకు పెడితేనే సోయి వస్తదని చెప్పారు.
రెండేండ్లలో ఏమి చేయకపోయినా ప్రజలు గెలిపించారు కాబట్టి ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చకుండా మరింత రెచ్చిపోతుదని అన్నారు. కమలం పార్టీ పూజకు పనికి రాని పువ్వులాంటిదని ఎద్దేవా చేశారు. తెలంగాణభవన్‌లో తన సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేటకు చెందిన బీజేపీ సీనియర్ నేత చెర మహేశ్, ఆయన అనుచరులకు పార్టీ కండువాలు కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూ బ్లీహిల్స్ ఎన్నికతో కాంగ్రెస్ సర్కార్‌కు గుణపా ఠం చెప్పాలని చెప్పారు. కాంగ్రెస్ గెలిస్తేనే అభివృద్ధి జరుగుతుందని చెప్తున్న రాష్ట్రంలో రెండేండ్లుగా అధికారంలో ఉన్నది ఎవరో ఆ పార్టీ నేతలే చెప్పాలని ప్రశ్నించారు. గతంలో దశాబ్దాలపాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం అభివృద్ధి చేసిందని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మోరీలో వేసినట్టేనని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు బాగా సంపాదించారని, అక్రమ మార్గంలో గెలవడానికి విశ్వప్రయత్నాలు చేస్తారని ఆయన చెప్పారు. రెండేండ్లలో సంపాదించిన అవినీతి సొమ్మును జూబ్లీహిల్స్‌లో ఖర్చుపెడతారని, ఒక్కో ఓటుకు రూ.10 వేలు ఇవ్వొచ్చని ఆరోపించారు. ఆ డబ్బులు తీసుకొని బీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేస్తే మోరీలో వేసినట్టేనని స్పష్టంచేశారు. హైదరాబాద్‌లో తిరిగి అభివృద్ధి గాడిన పడాలటే కేసీఆర్ తిరిగి రావాల్సిందేనని, అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే మొదలు కావాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు అమలుకాకపోవడంతో ప్రభుత్వంపై ప్రజ లు ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతేనే నెలకు రూ.4 వేల పెన్షన్లు వస్తాయని, ఆ పార్టీ ఎన్నికల కోసం చెప్పిన హామీలన్నీ అమలు అవుతాయని చెప్పారు.
అరచేతిలో వైకుంఠం చూపించి గద్దెనెకిన కాంగ్రెస్ సర్కారు.. ఈ రెండేండ్లలో ఒకటంటే ఒక మంచి పని కూడా చేయలేకపోయిందని కేటీఆర్ విమర్శించారు. ‘ఒక ఇల్లు కట్టలేదు. ఒక ఇటుక పెట్టలేదు. కానీ రెండు లక్షల 30 వేల కోట్ల రూపాయల అప్పులు మాత్రం చేసింది. గరీబోళ్ల ఇండ్లు ఎకడుంటే అకడికి రేవంత్‌రెడ్డి బుల్డోజర్లు పంపించి పేదల ఇండ్లు కూలగొట్టిస్తున్నడు. కోర్టులు, చట్టబద్ధమైన డాక్యుమెంట్లు ఇవేవీ చూడకుండా పేదల ఇండ్లపైకి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్లను నడిపిస్తున్నది. పిల్లలను పుస్తకాలు కూడా తీసుకోనిస్తలేదు. బండ్లను కూడా తోసేస్తున్నది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు డిపాజిట్ గల్లంతు చేయకపోతే మరింత రెచ్చిపోతది’ అని కేటీఆర్ హెచ్చరించారు.
మోసం చేయడం రేవంత్‌రెడ్డి నైజమని, నమ్మినోళ్లను మోసం చేయడం సులభమని ఆయనే స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తుచేశారు. అన్నీ తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల అంశంలో రేవంత్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. పార్లమెంట్లో చేయాల్సిన చట్టం అసెంబ్లీలో చేస్తే చెల్లదని తెలిసినా, ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేస్తుందని తెలిసి కూడా బీసీ రిజర్వేషన్ల పేరుతో నాటకాలు ఆడి మోసం చేశారని మండిపడ్డారు. అజారుద్దీన్‌కు ఇస్తామని చెప్పిన ఎమ్మెల్సీ కూడా ఆయనకు రాదని తెలుసు, కానీ ఆయనను కూడా రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని విమర్శించారు. తాజాగా షేక్‌పేటలో ఆర్మీ స్థలం అని తెలిసి కూడా ముస్లింలకు శ్మశాన వాటిక కోసం ఇస్తున్నట్టు మోసం చేశారని, ఆగ్రహం వ్యక్తంచేశారు. రెండేండ్లలో ఒకటంటే ఒక పనిచేయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కేవలం కేసీఆర్ నామం జపం చేసి కాలం గడిపేస్తున్నారని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మోకా మిస్ అయితే మళ్లీ జీహెచ్ఎంసీ ఎన్నికల దాకా మనకు అవకాశం లే దని, కాంగ్రెస్‌ను భయపెట్టాలంటే డిపాజిట్లు రాకుం డా ఓడించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. వరుసలు కలుపుతూ ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను ఆరు గ్యారెంటీలపై నిలదీయాలని కోరారు. బాకీ కార్డు చూపించి మా తులం బంగారం ఎప్పుడిస్తున్నరు? మా స్కూటీలు ఎప్పుడిస్తరు? మా 2,500 ఎప్పుడిస్తరు? అని కాంగ్రెస్ నేతల్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. పువ్వు పార్టీ పూజకు పనికిరాని పువ్వు అని ఎద్దేవా చేశారు. ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే వేస్ట్ అయిపోతదని సూచించారు.
కేసీఆర్ పదేండ్లలో కేవలం హైదరాబాద్‌లోనే 42 ఫ్లైఓవర్లు కట్టారని, షేక్‌పేట ఫ్లైఓవర్ కూడా కేసీఆర్ హయాంలోనే నిర్మించారని గుర్తుచేశారు. ఒక దీపం మరో దీపాన్ని వెలిగించినట్టుగా బీఆర్ఎస్ నేతలు అందరూ కలిసికట్టుగా మెలిసి సునీతాగోపీనాథ్ను గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, నాయకులు ముఠా జయసింహ, పుట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, పుంజాల శ్రీశైలం బీఆర్ఎస్ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ముజీబుద్దీన్, ఇంతియాజ్, సోఫి యా సిద్ధిఖీ, మసీఉల్లాఖాన్, మోహిద్‌ఖాన్, వహీద్ అడ్వకేట్, ఆజంఅలీ తదితరులు పాల్గొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలు అమలుకాకపోవడంపై ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతేనే నెలకు రూ.4 వేల పెన్షన్లు వస్తాయి. ఆ పార్టీ ఎన్నికల కోసం చెప్పిన హామీలన్నీ అమలవుతాయి.
-కేటీఆర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా మళ్లీ ఎగిరేది గులాబీ జెండాయేనని చెర మహేశ్ ధీమా వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన మహేశ్ మాట్లాడుతూ మాగంటి గోపీనాథ్ నియోజకవర్గ ప్రజల కోసం అహర్నిశలు శ్రమించారని, ఆపదలో ఉన్న ఆయన కుటుంబానికి ఇప్పుడు మనమంతా అండగా ఉండాలని పిలుపునిచ్చారు. షేక్‌పేట డివిజన్ నుంచి అత్యధిక మెజార్టీ వచ్చేలా సమష్టిగా కృషిచేయాలని కోరారు. కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు కోపంగా ఉన్నారని, తెలంగాణ ఉద్యమకాలం నాటి పరిస్థితి ప్రస్తుతం ఉన్నదని చెప్పారు. ఇంటింటికీ తిరిగి సునీతాగోపీనాథ్ గెలుపు కోసం పనిచేయాలని తన అనుచరులకు, కార్యకర్తలకు విజ్ఞప్తిచేశారు.