కేసీఆర్ తెలంగాణకు శ్రీరామ రక్ష.. ‘ఉమ్మడి మెదక్ జిల్లాలో 3 జిల్లా పరిషత్‌లు గెలిచి తీరుతం. కష్టపడి పనిచేద్దాం. మిగతా వాళ్లూ, మీరు కలిసి పనిచేయండి’ అని హరీశ్ సూచించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో ఉన్న వాళ్లకు ఏ తెల్వది, బీ తెల్వది. మనమంతా కలిసి పనిచేద్దాం. ప్రతి కార్యకర్తను కాపాడుకుందాం. ఆ బాధ్యత కేసీఆర్‌ది, కేటీఆర్‌ది, నాది. ఉద్యమకాలం నుంచి అండగా మెదక్ ఉన్నది. ఎంపీటీసీలను గెలిపించుకుందాం. మళ్లీ మెదక్ మీద గులాబీ జెండా ఎగరేసేదాకా అందరం కలిసి పనిచేద్దాం’ అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శశిధర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి శుభాశ్రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, జగపతి, మల్లికార్జున్‌గౌడ్, సోములు, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, జితేందర్‌గౌడ్, అంజగౌడ్, సుధాకర్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, రాజు, ఆంజనేయులు, ఎర్రోళ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. బీఆర్ఎస్లో చేరినవారిలో జీవన్, గంగా నరేందర్, రంగారావు, మాయశీను, విజయలక్ష్మి వంటి ప్రముఖ నేతలు ఉన్నారు.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ) :‘తెలంగాణ సమాజంలోనే, మా రక్తంలోనే తిరుగుబాటు తత్వం ఉన్నది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ‘ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదేలేసి, అధికారం రాగానే ఎగిరెగిరి పడితే ఎట్లా? మేము కూడా పదేండ్లు అధికారంలో ఉన్నం.. ఎప్పుడూ లేకిగా మాట్లాడలేదు’ అని హితవు పలికారు. సీఎం రేవంత్‌రెడ్డికి కర్రుకాల్చి వాతపెట్టే సమయం వచ్చిందని ఫైర్ అయ్యారు. సోమవారం బీఆర్ఎస్ మెదక్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ కౌన్సిలర్లు బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు నాయకత్వంలో కాంగ్రెస్ కౌన్సిలర్లు, కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యమంటే అడ్డమైన కేసులు పెట్టించుడు, కార్యకర్తలను కొట్టించుడు, పోస్టు పెడితే పోలీసులతో ఫోన్ చేయించడమేనా? అని ప్రశ్నించారు. ‘నర్సింగ్ అనే కార్యకర్త ఒక్క పోస్టు పెడితే పోలీసులు పొట్టుపొట్టు కొట్టిండ్రు. మరీ ఇంత అరాచకమా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇందిరమ్మ రాజ్యమంటే కేసులు పెట్టుడు.. రోకలి బండలు ఎక్కించుడు, ఇష్టమొచ్చినట్టు కొట్టుడు, గుద్దుడు.. భావప్రకటన స్వేచ్ఛ లేకుండా ప్రవర్తించడమేనా?’ అని నిలదీశారు. ‘ఒక ముఖ్యమంత్రిని పొగడటం తప్పా? తిట్టొద్దని చెప్పడం ఎంతవరకు కరెక్టు? నువ్ ఇచ్చిన హామీలను నెరవేరిస్తే.. తెలంగాణ మీద ప్రేమ చూపిస్తే.. కేసీఆర్ కంటే నువ్ ఎక్కువ మంచి పనులు చేస్తే.. ప్రజలే నీ గురించి మంచి మాటలు చెప్తరు. లేకపోతే బరాబర్ నిలదీస్తరు.. అది గుర్తెరుగు రేవంత్’ అని ఘాటుగా హెచ్చరించారు.
కేసీఆర్ ఉద్యమించకుంటే నువ్వు ఎక్కడ?
‘తెల్లారితే పనికిమాలిన మాటలు.. నోరు విప్పితే పాపపు మాటలు.. కేసీఆర్ వంటి నాయకుడిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నడు. నువ్వు ఇయ్యాల కుర్చీలో కూర్చున్నవంటనే, ఆ కుర్చీలో కూర్చోనే భాగ్యం వచ్చిందంటనే కారణం కేసీఆర్’ అని కేటీఆర్ గుర్తుచేశారు. ‘కేసీఆర్ లేకపోతే, గులాబీ జెండా ఎగరకపోతే తెలంగాణ వస్తుండెనా? ఆ మాత్రం తెల్వదా నీకు ?’ అని ప్రశ్నించారు. ‘ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రులను చూసినం కాని.. రేవంత్‌రెడ్డి అంత చెత్త ముఖ్యమంత్రిని చూడలేదని మండిపడ్డారు. ‘ఆయన గురించి ఎవరిముందటైనా మైకు పెడితే చాలు.. తెలుగు భాషలో ఉన్న తిట్లన్నీ తిడుతున్నరు..ఆ తిట్లకు రోషం ఉన్నోడైతే బకెట్లో నీళ్లు పోసుకొని సచ్చిపోతుండెనని, రేవంత్‌రెడ్డికి ఆ పట్టింపులేవీ లేవ’ని దుయ్యబట్టారు. ‘నాడు హరీశన్న మంత్రి అయిండని ఇక్కడనే డాన్స్‌లు చేసిన వ్యక్తి.. ఇప్పుడు పెద్ద పోటుగాడి లెక్క నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నువ్వు నిలబెట్టుకున్న హామీలేవీ?
ఎన్నికల ముందు రూ.2 లక్షల వరకు రైతు రుణాలను మాఫీ చేస్తామని చెప్పి గద్దెనెక్కగానే రేవంత్‌రెడ్డి ప్లేటు ఫిరాయించాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రైతుబంధు అంశంలో కేసీఆర్ మీకు పదివేలు ఇచ్చి భిక్షమేస్తుండని చెప్పి.. నేను 15వేలు ఇస్తానని ఓట్లు వేయించుకొని, తీరా రెండుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు.. ఇటీవల రైతుబంధు రూ.12వేలే వేసి దాని కోసం సంబురాలు చేసుకొమ్మని ఏ ముఖం పెట్టుకొని రైతులకు చెప్తున్నవ్?’ అని ప్రశ్నించారు.
ఏ ముఖ్యమంత్రైనా అలా అంటడా?
తనకు రేవంత్‌రెడ్డిలా మాట్లాడం ఇష్టం ఉండదని, కానీ తాను రేవంత్‌రెడ్డికి అర్థమయ్యేలా మాట్లాడితేనే ఆయన బుర్రకు ఎక్కుతుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి అయినా.. నన్ను కోస్కతింటరు అని అంటడా? ఢిల్లీకి పోతే దొంగను చూసినట్టు చూస్తున్నరని అంటడా? అపాయింట్మెంట్ కోసం పోతే చెప్పులు ఎత్తుకపోయేటోని లెక్క చూస్తాండ్రని ఏ ముఖ్యమంత్రి అయినా అంటడా? ఆయనను తిట్టాలనే నోటి తీటతోని అంటలేను. ఆయనకు పాలన చేతగాదనే అంటున్నం’ అని చెప్పారు. ‘సిద్దిపేటలో పందులు మాయమైనయ్.. మెదక్‌లో కూడా గాడిదలు దాదాపుగా పోయినయ్.. ఇంకా కొన్ని ఉన్నయి. అవేంటనేది చెప్పను. వాటి సంగతి సందర్భం వచ్చినప్పుడు చూసుకోండ్రి’ అని హెచ్చరించారు. రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెలో ఎవ్వరికి ఏ సమస్య ఉన్నా ముందుగా వెళ్లే నేత హరీశ్‌రావు అని కొనియాడారు.
తెలంగాణ కోసం కష్టపపడుదాం
‘మూడున్నరేండ్ల పాలనను ముందు పెట్టుకొని.. అధికార పక్షాన్ని ఛీ కొట్టి.. ప్రతిపక్షంలోకి రావడం మామూలు విషయం కాదు. అందుకే ఇవాళ పార్టీలో చేరుతున్న మిత్రులకు స్వాగతం చెప్తున్నం. మీకు అండగా పార్టీ ఉంటుంది. మేముంటం. హరీశ్ మీకు అండగా ఎప్పుడూ ఉంటారు’ అని కేటీఆర్ భరోసా ఇచ్చారు. అందరం కలిసి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ కోసం కష్టపడదామని పిలుపునిచ్చారు. ‘పూర్వపు మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్, త్వరలో జరగబోయే 3 జిల్లా పరిషత్‌లు మనం గెలుస్తామనే విశ్వాసం మాకు, కేసీఆర్‌కు ఉన్నది. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అని ధీమా వ్యక్తంచేశారు. ‘కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటాం. ఎప్పటికప్పుడు హరీశ్ నాయకత్వంలో మళ్లీ జిల్లాలో మన ప్రభుత్వం ఏర్పడేలా.. కేసీఆర్ తిరిగి సీఎంగా పగ్గాలు చేపట్టేలా అందరం నిరంతరం కష్టపడుదాం’ అని పిలుపునిచ్చారు.
నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి..
‘రేవంత్‌పాలన.. నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి అన్నట్టుగా ఉన్నదని హరీశ్‌రావు విమర్శించారు. ‘కేసీఆర్ కిట్, బతుకమ్ము చీరెలు, ఫీజు రీయింబర్స్మెంట్ బందయింది. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. అందుకు అంతా ఒక్కటి కావాలి. ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలి’ అని ప్రజలకు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. ‘ఎక్కడికి వెళ్లినా మళ్లీ సారు రావాలి.. మళ్లీ కేసీఆర్ రావాలి.. బీఆర్ఎస్ గెలువాలి అని అంటున్నారు. మనం కూడా గట్టిగా పనిచేద్దాం. లోకల్ బాడీస్‌లో అందరం కలిసి మెలిసి పనిచేద్దాం’ అని పిలుపునిచ్చారు. ‘నువ్ మేడిగడ్డను 20 నెలలనైనా రిపేర్ చేస్తలేవు. కూలింది రెండు పిల్లర్లు మాత్రమే. అవి కుంగినయ్ అంతే.. మీ మెదడు మొత్తం కుగిపోయింది. మేడిగడ్డ బరాజ్ గేట్లు ఎత్తి ఉన్నా గోదావరిలో నీళ్లు కన్నెపల్లి మోటర్ల నుంచి ఎత్తిపోసి పంటలకు నీళ్లు ఇవ్వొచ్చు అని మాట్లాడినం’ అని హరీశ్ చెప్పారు.
ఉత్తమ్.. దమ్ముంటే చర్చకు రా..
హరీశ్‌రావు అన్నీ అబద్ధాలే చెప్తున్నాడని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నాడని, కాంగ్రెస్ వాళ్లకు విషయం, నిజం మాట్లాడే ధైర్యం లేదని హరీశ్ దుయ్యబట్టారు. ‘ఏవి అబద్ధాలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డీ? శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైంది అబద్ధమా? నువ్ కల్వకుర్తి మోటర్లు ఆన్ చేయలేదని చెప్పింది అబద్ధమా? నిరుడు తెలంగాణకు వాడుకోవాల్సిన 65 టీఎంసీలను ఆంధ్రా చంద్రబాబుకు అప్పజెప్పి, తెలంగాణలో పంటలు ఎండబెట్టింది అబద్ధమా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డి పాడు గేట్లు ఎత్తి నీళ్తు తీస్కపోతుంటే.. నువ్ కల్వకుర్తి మోటర్లు ఒత్తి నీళ్లు ఇవ్వలేదు అది అబద్ధమా? కన్నెపల్లిలో దాదాపు లక్ష క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో ప్రవహిస్తున్నాయని చెప్పిన.. ఇది అబద్ధమా? ఏది అబద్ధం?’ అని నిలదీశారు. దమ్ముంటే బహిరంగ చర్చకు రా.. ఎక్కడ మాట్లాడదామో చెప్పు. లక్ష క్యూసెక్కులు గోదావరిలో పారేది నిజం కాదా? పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఆంధ్రోడు నీళ్లు ఎత్తుకపోయేది నిజంకాదా? కల్వకుర్తి మోటర్లు ఆన్ చేయక నాగర్ కర్నూల్‌ను ఆగంపట్టిస్తున్నది నిజం కాదా? ఆంధ్రవాళ్లు కృష్ణానదిలో అధికంగా నీళ్లు తీస్కుపోతుంటే మీరు గుడ్లప్పగించుకొని చూస్తూ తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా?’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మెదక్ నుంచే కాంగ్రెస్ పతనం: పద్మాదేవేందర్‌రెడ్డి
ఇచ్చిన హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పతనం మెదక్ గడ్డ నుంచే ప్రారంభమైందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అధికార పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి భారీగా చేరికలే ఇందుకు సజీవ సాక్ష్యమని చెప్పారు. కేసీఆర్ పాలనలో 100 సీట్లతో మెదక్‌కు మెడికల్ కాలేజీ ఇస్తే 50 సీట్లకు కుదించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కిందని మండిపడ్డారు. అధికార పార్టీ దుర్మార్గాలను భరించలేకే ఆ పార్టీ నాయకులు తిరిగి బీఆర్ఎస్లోకి వస్తున్నారని చెప్పారు. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కష్టపడి మెదక్ గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేదాకా విశ్రమించవద్దని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్లో చేరికల జోష్
స్థానిక ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు చెందిన అనేకమంది నాయకులు, కార్యకర్తలు గులాబీ గూటికి చేరుతున్నారు. సోమవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు మెదక్ జిల్లా నుంచి భారీ కాన్వాయ్‌తో కాంగ్రెస్ క్యాడర్ కదిలొచ్చింది. మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి నాయకత్వంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో సుమారు 200 మంది నాయకులు, కార్యకర్తలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మెదక్ ప్రస్తుత ఎమ్మెల్యే రోహిత్ స్వగ్రామం కొర్విపల్లికి చెందిన మాజీ సర్పంచ్‌లు మైనంపల్లి రంగారావు, మల్లేశంతో పాటు అనేక మంది ముఖ్యనేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడం గమనార్హం. వీరి చేరికలతో బీఆర్ఎస్లో కొత్త జోష్ కనిపిస్తున్నది. కాంగ్రెస్ గద్దెనెక్కి ఏడాదిన్నర కూడా దాటకముందే గతంలో పార్టీని వీడిన వారు తిరిగొస్తుండటం, కొత్తవారు సైతం పార్టీలోకి రావడంతో శ్రేణుల్లో ఉత్సాహం తొణికిసలాడుతున్నది.మెదక్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అభివృద్ధిని పక్కనబెట్టి ప్రతీకార రాజకీయాలు చేయడం నచ్చకనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశామని పలువురు నాయకులు చెప్పారు.
కేసీఆర్ హయాంలోనే మెదక్ జిల్లాకు వెలుగు ‘బీఆర్ఎస్ హయాంలో మెదక్ రూపురేఖలు మారాయని హరీశ్ గుర్తుచేశారు. ‘మెదక్‌లో రామాయంపేట రెవెన్యూ డివిజన్ కావాలని కోరుకుంటే.. కేసీఆర్ ఇచ్చారు. డిగ్రీ కాలేజీ ఇచ్చారు. మెదక్‌కు ఎస్సీ మహిళా రెసిడెన్సియల్ డిగ్రీ కాలేజీ, ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీ తెచ్చుకున్నం.. గణపురం కాలువ ఆధునికీకరణకు కేసీఆర్ వచ్చి ఆనకట్టకు నిధులిచ్చి.. చిట్టచివరి ఆయకట్టుకు నీళ్లు పోయేలా చేశారు. ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు జరిగినయి’ అని వివరించారు. మళ్లీ బీఆర్ఎస్లోకి వస్తున్నవారిలో ఉద్యమకారులే ఉన్నారని, 2001లో గులాబీ జెండా పట్టి.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. ‘శంకరంపేట అమరవీరుల స్తూపం నిర్మాణంలో మీ చెమటచుక్కలు ఉన్నయి. దాన్ని కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించుకున్నం. మీరంతా పార్టీలోకి రావడం ఎంతో సంతోషంగా ఉన్నది. మన నాయకులు మిమ్మల్ని గౌరవంగా ఆహ్వానించడం, దగ్గరుండి తీసుకొని రావడం చాలా సంతోషంగా ఉన్నది. అందర్నీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’ అని చెప్పారు. ‘కచ్చితంగా మెదక్ జిల్లా పరిషత్‌లో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తది.. మెదక్ మున్సిపాలిటీకి ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది బీఆర్ఎస్సే.. ప్రజలకు పాలేందో నీళ్లేందో తేలిపోయింది’ అని తెలిపారు.
20 నెలల పాలనలో ఏం ఒరిగింది? : హరీశ్‌రావు
‘నిజం నిలకడపై తెలుస్తుందన్నట్టు.. ప్రజలకు ఇప్పుడిప్పుడే వాస్తవాలు తెలుస్తున్నయి. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం ఒరిగింది? కేసీఆర్ ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోసే పరిస్థితి లేక అవి షెడ్డుకు పోతున్నయి’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘పదిరోజుల్లో ఒక్కరోజు కూడా ట్రాక్టర్లు నడుస్తలేవు. చెత్త సేకరణ నిలిచిపోయింది. ప్రతి ఊరిలో కరెంటు బుగ్గలు కాలిపోయినయి. పైపు పగిలితే అడిగేవాడు లేడు. మొత్తం పరిపాలనే కుంటుపడింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నరు. వ్యాపారాలు తగ్గిపోయినయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఊర్లకు పోతే యూరియా దొరకడం లేదు. ఎకరానికి ఒక బస్తానే ఇస్తామంటుండు. మళ్లీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. ఆ విషయాలన్నీ ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైతున్నయి’ అని పేర్కొన్నారు.
నాట్లకు కేసీఆర్.. ఓట్లకు రేవంత్
సీఎం రేవంత్‌రెడ్డి కేవలం ఓట్లప్పుడు మాత్రమే రైతుబంధు వేస్తున్నడని హరీశ్ మండిపడ్డారు. ‘ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని వేస్తున్నడు. నడిమిట్లో రెండు ఎగ్గొట్టిండు. కేసీఆర్ కరోనా ఉన్నా, కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు, మంత్రులకు జీతాలు బంధుపెట్టి రైతులకు సకాలంలో రైతుబంధు ఇచ్చిండు. నాట్లకు నాట్లకు కేసీఆర్ ఇస్తే.. ఓట్లకు ఓట్లకు రేవంత్‌రెడ్డి ఇస్తున్నడు. రైతులు మర్చిపోతరని ఆయన అనుకుంటుండు. ఆయన ఎంత బాకీ పడ్డడో రైతులకు తెల్వదా’ అని నిలదీశారు. ‘ఉద్యోగులు తల్లిదండ్రులకు అన్నం పెడ్తలేరని, మంచిగ చూసుకుంటలేరని వారి జీతాల్లోంచి 10-15 శాతం కట్ చేసే అంశాన్ని సీఎం పరిశీలిస్తున్నట్టు పేపర్లో వచ్చింది. అలాంటిది నువ్ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చినవ్. 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నవ్.. మొదటి సంతకం వాటిమీదనే పెడ్తా అన్నావ్.. చట్టబద్ధత తెస్తానన్నవ్.. అన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి.. 420 హామీలు ఎగ్గొట్టినవ్. అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసినందుకు నీకు ఏం కోత పెట్టాలో చెప్పు’ అని నిలదీశారు.
సొంతింటికి వచ్చినట్టున్నది
కాంగ్రెస్ 19 నెలల పాలనలో మెదక్‌లో అభివృద్ధి కుంటుపడింది. ఇక్కడి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ప్రజలకు చేసిందేమీలేదు. ఆయన కేసీఆర్, హరీశ్‌రావు, పద్మా దేవేందర్‌రెడ్డిని తిట్టడం, కార్లల్లో సిద్దిపేటకు వెళ్లి అరాచకాలు సృష్టించడం తప్ప సాధించిందేమీలేదు. ఆయన వైఖరితో విసిగిపోయి మళ్లీ బీఆర్ఎస్లో చేరిన. ఇప్పుడు పరాయి ఇంటి నుంచి సొంతగూటికి వచ్చినట్టున్నది. భవిష్యత్తులో మళ్లీ తప్పుచేయబోం. సమష్టిగా పనిచేసి మళ్లీ బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తం.
– జీవన్‌రావు, మెదక్ (మార్కెట్ కమిటీ చైర్మన్)
ఏడాదిన్నరలో అనేక ఇబ్బందులు..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏదో మార్పు వస్తదని ఆ పార్టీలోకి వెళ్లిన. కానీ ఏడాదిన్నరలో ప్రతిపక్షంపై కక్ష సాధించడం తప్ప ప్రజలకు చేసింది శూన్యం. అందుకే మళ్లీ బీఆర్ఎస్లో చేరిన. ఈ రోజు నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. పద్మక్క నాయకత్వంలో బీఆర్ఎస్ పటిష్టానికి కృషి చేస్తా. వచ్చే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తా..
– గంగా నరేందర్,రామాయంపేట (ఏఎంసీ మాజీ చైర్మన్)