KTR | హైదరాబాద్ : ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో.. రేవంత్ సర్కార్ను నిలదీసి అడిగేందుకే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర స్థాయి నాయకుల నుండి క్షేత్ర స్థాయి నాయకుల వరకు, అందరం రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఈ బాకీ కార్డులను తీసుకెళ్లి ఇస్తామని ఆయన తెలిపారు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి, ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ బాకీ కార్డుల ద్వారా వినూత్న నిరసన కార్యక్రమం, ప్రచారం చేపట్టినట్లు పేర్కొన్నారు. 100 రోజులు కాదు 700 రోజులైనా హామీలు అమలు చేయడం లేదు. వివిధ వర్గాలకు ఎంత బాకీ ఉన్నారో ఇందులో వివరించాం. 8 లక్షల పెండ్లిలు అయ్యాయి.. ఇప్పటి వరకు తులం బంగారం జాడనే లేదు. తొలి కేబినెట్ సమావేశంలోనే దీనిపై హామీ చట్టం తెస్తామన్నారు. కానీ ఆ ఊసే లేదన్నారు కేటీఆర్.
అంగ వస్త్రం కోసం పోతే ఉన్న వస్త్రం పోయింది అన్నట్టు పాలన ఉందన్నారు. రైతులకు రైతుబంధు, రుణమాఫీ లేదు. కౌలు రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు, ఆటో అన్నలకు దాదాపు రూ.24 వేలు, మహిళలకు నెలకు రూ.2500.. పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు నెలకు రూ.4 వేలు, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందన్నారు.
చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇవ్వడం లేదు. పేదలకు ఇందిరమ్మ ఇండ్లు.. ఉద్యమకారులకు 250 చ.గజాల స్థలం జాడే లేదు. విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ఊసే లేదు. ఇలా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని తెలుపుతాం. మా మీద కేసులు పెట్టిన భయపడం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.