రాయ్‌బరేలీ: ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఐ లవ్ మహమ్మద్( I Love Muhammad) ఆందోళనకు పిలుపునిచ్చిన స్థానిక ముస్లిం పూజారి, ఇత్తెహద్ ఇ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ తౌకీర్ రాజాను అరెస్టు చేశారు. శనివారం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఐ లవ్ మహమ్మద్ క్యాంపేన్‌కు మద్దతు ఇచ్చేవాళ్లు భారీ సంఖ్యలో హాజరుకావాలని తౌకీర్ రాజా పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం ప్రార్థనల తర్వాత భారీగా ఆయన ఇంటి ముందు జనం గుమ్మిగూడారు. ప్రస్తుతం పోలీసులు ఆయన్ను విచారిస్తున్నారు.
శుక్రవారం రాళ్లు రువ్విన స్థానికులపై పోలీసుల లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పది మంది పోలీసులు గాయపడ్డారు. రాజా ఇంటి ముందు ప్లకార్డులతో జనం భారీగా గుమ్మికూడి నినాదాలు చేశారు. దానికి సంబంధించిన వీడియోను రిలీజ్ చేశారు. బరేలీ ఘటనతో లింకున్న 8 మందిని అరెస్టు చేశారు. 50 మందిని కస్టడీలోకి తీసుకున్నారు. గుర్తు తెలియని 1700 మందిపై కేసు ఫైల్ చేశారు.
ఐ లవ్ మహమ్మద్ ప్రచారం దేశవ్యాప్తంగా వ్యాపించింది. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో ముస్లింలు కొన్ని షాపులు, వాహనాలను ధ్వంసం చేశారు. కర్నాటకలోని దేవనగిరిలో కూడా ఐ లవ్ మహమ్మద్ పోస్టర్లు వెలిశాయి. దీంతో అక్కడ రెండు గ్రూపుల మధ్య రాళ్లు రువ్వే సంఘటనలు జరిగాయి. యూపీలోని ఉన్నావో, మహారాజ్ఘంజ్, లక్నో, కౌషాంబిలో కూడా అల్లర్లు చోటుచేసుకున్నాయి.
ఈద్ మిలాద్ ఉన్న నబి సందర్భంగా సెప్టెంబర్ 4వ తేదీన యూపీలోని కాన్పూర్‌లో ర్యాలీ సమయంలో ఐ లవ్ మహమ్మద్ పోస్టర్ వెలిసింది. ర్యాలీ రూట్లో ఉన్న ఓ టెంటుకు ఐ లవ్ మహమ్మద్ పోస్టర్ వేశారు. హిందువుల పండుగల చేసుకుంటున్న ప్రదేశంలో కావాలనే ముస్లింలు ఆ పోస్టర్‌ను పెట్టినట్లు హిందూ గ్రూపులు ఆరోపించాయి. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొన్నది. తమ పోస్టర్లను చింపేసినట్లు హిందువులు ఆరోపించారు. అయితే మహమ్మద్ ప్రవక్త పట్ల తమ ప్రేమను వ్యక్తం చేస్తుంటే మమ్ముల్ని టార్గెట్ చేస్తున్నారని ముస్లింలు పేర్కొన్నారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో ఐ లవ్ మహమ్మద్ ట్రెండింగ్ అయ్యింది.
వారణాసిలో ఐ లవ్ మహమ్మద్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. ఐ లవ్ మహదేవ్ అని ప్లకార్డులు పెట్టారు.