భూత్పూర్, మే 16: బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కార్యకర్తలంతా కలిసికట్టుగా పనిచేయాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కోరారు. శుక్రవారం సాయంత్రం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో తన నివాసంలో నియోజకవర్గంలోని కౌకుంట్ల మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆల వెంకటేశ్వర్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతుబంధు, రుణమాఫీ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని మండిపడ్డారు. ఈ అంశాల పట్ల కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం చేయాలని కోరారు. అదేవిధంగా యువకులు సోషల్ మీడియాలో చాలా చురుకుగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని కోరారు. కౌకుంట్ల మండలం కొత్తగా ఏర్పడినదని.. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల కోసం పనిచేయాలని కోరారు.