Harish Rao : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరు లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణభవన్‌లో లైసెన్స్డ్ సర్వేయర్లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రాక, ఇల్లు గడువక, ఆర్థిక భారం పెరిగి లైసెన్స్డ్ సర్వేయర్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
సర్వే చేయడం ద్వారా ఎకరాకు రూ.60 వస్తుందని, ఆ 60 రూపాయలు బండి పెట్రోల్‌కు కూడా సరిపోదని, అలాంటప్పుడు సర్వేయర్లు బతికేది ఎట్లా అని హరీశ్‌రావు ఆవేదన వెలిబుచ్చారు. సర్వేయర్ల సమస్యలపై తాము ప్రభుత్వంతో పోరాడుతామని చెప్పారు. సెప్టెంబర్ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, ఆ సమావేశాల్లో ఒకరోజు తాము లైసెన్స్డ్ సర్వేయర్ల సమస్యలపై గళమెత్తుతామని హామీ ఇచ్చారు. సర్వేయర్లు అధైర్యపడవద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.