Munipally | మునిపల్లి: ముంబయి జాతీయ రహదారికి (Mmbai National Highway) అతి సమీప దూరంలో ఉన్న సర్కార్ భూమిని ఓ రైతుకు కొన్ని సంవత్సరాల క్రితం ప్రభుత్వం అందించింది. బతుకుదెరువు కోసం ఇచ్చిన ప్రభుత్వ భూమిని అమ్ముకునే పనిలో నిమగ్నం అయ్యారు. ఇది అధికారులు నిత్యం విధులకు హాజరయ్యేందుకు వెళ్లే దారిలో ఉంది. కానీ వారు ఈ భూమివైపు దృష్టి సారించడం లేదు ఎందుకు అని మునిపల్లివాసులు ప్రశ్నిస్తున్నారు. మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాలోని 90-సర్వే నంబర్లో ఉన్న ఈ భూమిలో కొంతమంది వ్యాపారులు తప్పుడు సర్వే నంబర్లు వేసి రిజిస్టర్ చేసుకుని ఇళ్లు నిర్మించుకుంటున్నారు. ఈ విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ పెద్దమనిషి బుధేరా చౌరస్తాలోని ఓ పట్టాభూమిలో నిర్మించిన ఫంక్షన్ హాల్‌కు దారిలేదు. దీంతో పక్కన ఉన్న సర్కార్ భూమిలో నుంచి దర్జాగా సీసీ రోడ్డు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
వ్యాపారుల ఇష్టారాజ్యమా..?
మునిపల్లి మండలం బుధేరా చౌరస్తాలో కొంతమంది వ్యాపారులు (Businessmans) ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్కార్ భూముల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. భూమూల ధరలు కోట్ల రూపాయలు పలకడంతో సర్కార్ భూములను కబ్జా చేస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అండదండలతో వ్యాపారులు సర్కార్ భూముల్లో పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులపై పలు రకాల విమర్శలు చేస్తున్నారు.
చర్యలు తీసుకోవాలి
కబ్జాలకు గురవుతున్న సర్కార్ భూములను (Governments Lands) సంబందిత అధికారులు కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. నిత్యం అటుగా పోయే అధికారులకు సర్కార్ భూమి కనిపించడం లేదా అనే విమర్శిస్తున్నారు. సర్కార్ భూమిలో వేసిన రోడ్డుపై అధికారులను వివరణ కోరగా మాకు సమాచారం లేదు అంటూ బుధేరా జీపీవో నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సర్కార్ భూమిలో వేసిన రోడ్డును తొలగించాలని స్థానికులు విన్నవిస్తున్నారు.