చెన్నై: తమిళనాడు(Tamilnadu) సర్కారు యూ-టర్న్ తీసుకున్నది. ఆదేశాలు ఇచ్చి 24 గంటలు గడవకముందే వెనుకడుగు వేసింది. ప్రభుత్వ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులు, యువత.. నిరసన ప్రదర్శనల్లో పాల్గొనరాదు అని మంగళవారం తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ సింథియా సెల్వి పి ఆ ఆదేశాలు జారీ చేశారు.ఆగస్టు 17వ తేదీన ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆందోళనల్లో పాల్గొనే విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ తన ఆదేశాల్లో పేర్కొన్నది.
ప్రస్తుతం కాక్రోచ్ జనతా పార్టీ .. స్కూల్ ఠీక్ కరో అనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. సీఎం విజయ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై విమర్శలు వచ్చాయి. ఉన్నత విద్యాశాఖ, స్కూల్ విద్యాశాఖ, పోలీసు శాఖ, జిల్లా యంత్రాంగం అన్నీ ప్రభుత్వ కాలేజీలపై వత్తిడి పెంచే అవకాశాలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అయ్యాయి. నిరసనల్లో పాల్గొనే విద్యార్థుల వివరాలను తక్షణమే అధికారులకు చర్చాలని విద్యాశాఖ తన ఆదేశాల్లో పేర్కొన్నది. అర్జెంట్ అన్న మార్క్‌తో ఉన్న లేఖలను ప్రభుత్వ ఆర్ట్స్, సైన్స్ కాలేజీలకు తమిళనాడు విద్యాశాఖ పంపించింది. అయితే ఆ ఆదేశాలను ఇప్పుడు వెనక్కి తీసుకున్నారు.