ఖమ్మం, అక్టోబర్ 16: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న తాము తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ఖమ్మంలోని వివిధ పార్టీల నాయకులను, సంఘాల బాధ్యులను గురువారం కలిసి మద్దతు కోరారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ పార్టీల నాయకులను వారి వారి పార్టీ కార్యాలయాల్లో కలిశారు. బంద్‌కు సహకరించాలని, విజయవంతం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. ఆయా పార్టీలకు చెందిన గుండాల కృష్ణ, కూరాకుల నాగభూషణం, నెల్లూరి కోటేశ్వరరావు, కేతినేని హరీశ్ చంద్ర, నున్నా నాగేశ్వరరావు, దండి సురేశ్, పోటు రంగారావులను బీసీ నేతలు కలవగా.. ఆయా పార్టీల నాయకులందరూ వారి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. బీసీ సంఘాల నాయకులు బొమ్మా రాజేశ్వరరావు, కూరపాటి వెంకటేశ్వర్లు, కత్తి నెహ్రూ, మేకల సుగుణారావు, పెరుగు వెంకటరమణ, స్వర్ణకుమార్, బిచ్చాల తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. తొలుత బీసీ సంఘాల నేతలంతా కలిసి ఖమ్మంలోని జ్యోతీబాపూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
మణుగూరు టౌన్, అక్టోబర్ 16: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు ఈ నెల 18న చేపట్టే రాష్ట్రవ్యాప్త బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసిన విషయం అందరికి తెలిసిందేనని, రిజర్వేషన్ల అంశంపై న్యాయస్థానాల పేరుతో కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయం చేయకుండా వాటి అమలు కోసం కృషి చేయాలని సూచించారు. 18న నిర్వహించే బంద్‌లో బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.