భద్రాచలం, అక్టోబర్ 16: వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్న నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్షలకు సన్నద్ధం చేసే బాధ్యత తీసుకోవాలని ఐటీడీఏ పీవో బి.రాహుల్ సంబంధిత హెచ్ఎం, వార్డెన్లకు సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై గురువారం పీవో భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయంలో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మంచి బోధనతోపాటు వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.
ప్రతి పాఠశాలలో డైలీవైజ్ కార్మికులు సమ్మెలో ఉన్నందున ఈ నెల 20వరకు వేచి చూసి, ప్రతి పాఠశాలలో రెగ్యులర్ వర్కర్లను నియమించుకునే వెసులుబాటు కల్పిస్తామన్నారు. పాఠశాలల్లో మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుకోవాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. డీడీ వెల్ఫేర్ అశోక్, ఈఈ మధుకర్, జీసీసీ డీఎం సమ్మయ్య, ఏసీఎంవో రమేశ్, ఏటీడీవోలు చంద్రమోహన్, భారతీదేవి తదితరులు పాల్గొన్నారు.