కారేపల్లి, అక్టోబర్ 16 : ఆరుగాలం కష్ట పడిన రైతన్నకు మద్దతు ధర దక్కాలంటే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పంటలను ప్రభుత్వమే కొనాలని తెలంగాణ రైతు సంఘం కారేపల్లి మండల అధ్యక్ష, కార్యదర్శులు ముండ్ల ఏకాంబరం, వజ్జా రామారావు అన్నారు. గురువారం కారేపల్లిలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. కారేపల్లి మండలంలో పత్తి పంట విస్తీర్ణం పెరిగిందన్నారు. పత్తి కొనుగోలుకు ప్రభుత్వం వెంటనే సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలన్నారు. మిర్చి పంటకు పెట్టుబడులు అధికంగా పెరిగడం, దిగుబడులు తగ్గడం, రేటు లేక పోవడంతో రైతు నష్ట పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
మిర్చి రైతు అప్పుల పాలు కాకుండా, మనోధైర్యం దెబ్బతినకుండా ఉండాలని ప్రభుత్వం మిర్చి, మొక్కజన్న, పెసర పంటలను కొనుగోలుకు కేంద్రాలని తెరవాలని కోరారు. అలాగే అకాల వర్షాలతో పత్తి, పెసర, మొక్కజొన్న పంటలు నష్ట పోయాయని, పొలాలు మేటలు వేశాయని, బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించాలన్నారు. వానాకాలం ధాన్యం బోనస్, యాసంగి రైతు భరోసా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు పండుగ కొండయ్య, వల్లభనేని మురళి, కరపటి సీతారాములు, పాసిన్ని నాగేశ్వరరావు, దాసరి మల్లయ్య పాల్గొన్నారు.