BRS | షాద్‌నగర్, మార్చి 4: అధికారంలో ఉన్నామన్న విషయాన్ని మరిచి ప్రతిపక్ష నేతల్లా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ షాద్‌నగర్ పట్టణ అధ్యక్షుడు ఎంఎస్ నటరాజ్ మండిపడ్డారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతలు ఎక్కడకు వెళ్లినా ప్రతిపక్షంపై ఆరోపణలు చేస్తున్నారు తప్ప అభివృద్ధి గురిచి ఎక్కడా ప్రస్తావించడం లేదని విమర్శించారు. షాద్‌నగర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని అన్నారు.
ఫరూఖ్‌నగర్ ప్రభుత్వ పాఠశాలకు రూ.43.50 లక్షలు మంజూరు చేయడం బాగానే ఉన్నప్పటికీ.. పనులు ప్రారంభం కాకుండానే ప్రతిపక్షంపై అనవసర ఆరోపణలు చేయడం ఏంటని నటరాజ్ నిలదీశారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ గతంలో ఇదే పాఠశాలను మన ఊరు మనబడి కార్యక్రమానికి ఎంపిక చేయించి రూ.71లక్షలను మంజూరు చేయించారని, తమ ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన దానితో పోల్చితే కాంగ్రెస్ నేతలు తీసుకువచ్చింది ఎక్కువా? అని ప్రశ్నించారు. ఆ అభివృద్ధి పనులపై కాంట్రాక్టర్‌తో ఒప్పందం జరిగిందని.. కానీ తమ ప్రభుత్వం లేని కారణంగా పనులు అక్కడే నిలిచిపోయాయని చెప్పారు. పాఠశాల ఆవరణలో నిర్మించిన భవనాలను పరిశీలిస్తే ఎంత నాసిరకంగా కట్టారన్నది అర్థమవుతుందని, సదరు కాంట్రాక్టర్ ఇతరులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. గతంలో ఏడు గదులతో ఉన్నత డిగ్రీ కళాశాలను అంజన్న హయాంలో పూర్తి చేశామని, డిగ్రీ కళాశాలకు రూ.50లక్షలు వెచ్చించి ప్రహరీగోడను కడితే దానికి ఇప్పటి వరకు బిల్లు చెల్లించలేదని అన్నారు.
ప్రభుత్వాలు మారుతూ ఉంటాయని, అయితే ఏ ప్రభుత్వం మారినా గతంలో చేసిన బిల్లులు చెల్లించడం అనవాయితిగా వస్తుందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పెండింగ్ బిల్లులను చెల్లించకపోవడం అసమర్థ పాలనకు నిదర్శనమని ఎంఎస్ నటరాజ్ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో సర్వశిక్షా అభియాన్, మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా విద్యా వికాసం, విద్యా ప్రగతి వంటి పనులు అనేక చేపట్టామన్నారు. జేపీ దర్గా వద్ద ఎస్సీ గురుకుల పాఠశాలకు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించామన్న విషయాన్ని గుర్తించుకోవాలని సూచించారు. కొందుర్గు వద్ద కేజీబీవీ భవనం నిర్మించామని, తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు బలం చేకూర్చిందని, కాంగ్రెస్ నేతలు మాత్రం నోటికి వచ్చినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ను లక్ష్యంగా చేసుకొని వ్యక్తిగత విమర్శలు చేస్తే షాద్‌నగర్ ప్రగతి జరగదని, నియోజకవర్గ ప్రగతికోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏం ఇచ్చింది? ఏం తెచ్చింది? ఏం చేశారన్నది సభలు, సమావేశాల్లో చెప్పాలని హితవు పలికారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు చీపిరి రవియాదవ్, కానుగు అనంతయ్య, పిల్లి శేఖర్, గుండు అశోక్‌యాదవ్, రాజశేఖర్, శీలం శ్రీకాంత్, చిన్న, జూపల్లి శంకర్, మాజీ ఎంపీటీసీ బీశ్వ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.