సిద్దిపేట, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉద్యమాలకు పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ప్రాంతం దుబ్బాక. కేసీఆర్ అంటే ఎంతో ప్రేమ,ఆప్యాయత ఉన్న గడ్డ.. బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి వెన్నంటి ఉంటున్న పౌరుషం గల దుబ్బాక ప్రజలు తొలి విడత, రెండో విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి చైతన్యాన్ని చాటారు. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 145 గ్రామాలు ఉన్నాయి. నాలుగు గ్రామాలు (మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని 4 గ్రామాలు) మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగిన 141 గ్రామాలకు 85చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు అత్యధికంగా గెలిచిన స్థానాల్లో దుబ్బాక నియోజకవర్గం మూడో స్థానంలో నిలిచింది. దుబ్బాకలో దాదాపు 61 శాతం సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయితే రాష్ట్రంలోనే పంచాయతీ ఎన్నికల్లో తొలిస్థానంలో సిద్దిపేట నియోజకవర్గం ఉండనున్నది. ఇక్కడ 91 స్థానాలకు 80 స్థానాలకు పైగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు గెలిచారు. ఆ తర్వాత గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలు ఉండనున్నాయి. ఇంతటి విజయం సాధించడంపై బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా గెలుపొందిన సర్పంచ్‌లకు ఆయన అభినందనలు తెలిపారు.
దుబ్బాక నియోజకవర్గంలోని ఎన్నికలు జరిగిన 141 గ్రామాలకు మొత్తం 85 గ్రామాల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ 30, బీజేపీ 15, ఇతరులు 12 స్థానాల్లో గెలుపొందారు. మండలాల వారీగా దుబ్బాక మండలంలో 21 జీపీలకు 13, మిరుదొడ్డి మండలంలో 10 జీపీలకు 05, అక్బర్పేట భూంపల్లి మండలంలో 19 జీపీలకు 14 గ్రామాల్లో, తొగుట మండలంలో 17 జీపీలకు 09 జీపీలు, దౌల్తాబాద్ మండలంలో 25 జీపీలకు 17 జీపీలు, రాయపోల్ మండలంలో 19 జీపీలకు 9, మెదక్ జిల్లా చేగుంట మండలంలో 25 జీపీలకు 15 జీపీలు, నార్సింగ్ మండలంలో 5 జీపీలకు 03జీపీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు.
చాలాచోట్ల బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. నార్సింగిలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి ఆకుల సుజాత మల్లేశం గౌడ్ 1400 ఓట్ల మెజార్టీతో సర్పంచ్‌గా గెలుపొందారు. చేగుంట మండలం కర్నాల్‌పల్లి బీఆర్ఎస్ అభ్యర్థి జనగామ దుర్గారాములు గౌడ్ 525 ఓట్లు, తొగుట మండంలోని వెంకట్రావ్‌పేటలో బండార కవితా స్వామిగౌడ్ 904 ఓట్లు, దుబ్బాక మండలంలోని హబ్షిపూర్‌లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బాలెంల శ్రీలతారామచంద్రారెడ్డి 1000పైగా మెజార్టీతో గెలిచారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై స్పష్టమైన వ్యతిరేకత కనిపించింది. మళ్ల కేసీఆర్ సార్ రావాలని పల్లెజనం కోరుకుంటున్నారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో గ్రామాలకు పైసా నిధులు రాలేదు.. ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దీంతో గ్రామీణులు కాంగ్రెస్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నట్లు ఎన్నికల్లో స్పష్టమైంది.
దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు అద్భుత విజయం సాధించారు. ఇంకో నాలుగు గ్రామాలకు మూడో విడతలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు 61 శాతం బీఆర్ఎస్ అభ్యర్థులు సర్పంచ్‌లుగా గెలిచి రికార్డు సృషించారు. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిప అభివృద్ధి, సంక్షేమ పాలన బీఆర్ఎస్ అభ్యర్థుల విజయానికి దోహదం చేశాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు గ్రామ ప్రజలతో కలిసి మెలిసి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి. గ్రామాల అభివృద్ధికి కృషిచేసి మంచి పేరు తెచ్చుకోవాలి. మనం చేసే మంచి పనులే పేరు తీసుకువస్తాయి. అందరికీ నా అభినందనలు.
– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి