బీజింగ్, డిసెంబర్ 15: దేశంలో జననాల రేటును పెంచేందుకు ఇటీవలే కండోమ్‌పై ట్యాక్స్ విధించిన చైనా తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. మహిళలకు ప్రసవానికి ముందు, ప్రసవ సమయం, ఆ తరువాత అయ్యే మొత్తం వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించే విధంగా ఒక విధానాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించింది. ప్రసవ సంబంధిత వైద్య ఖర్చుల్లో పౌరులు తమ జేబులో నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చైనా నేషనల్ హెల్త్‌కేర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది. గర్భధారణ అనంతరం మెడికల్ చెకప్‌లు, ప్రసవం సమయంలో అందించే సేవలు, ప్రసవం తరువాత జరిగే చికిత్స ఖర్చులను కూడా ఈ పాలిసీలో భాగం చేస్తామని తెలిపింది.
ఇప్పటికే ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా పలు ప్రావిన్స్‌లలో అమలు చేస్తున్నామని, త్వరలో దేశవ్యాప్తంగా విస్తరిస్తామని పేర్కొంది. చైనాలో వరుసగా మూడు సంవత్సరాల నుంచి జనాభా పెరుగుదల తగ్గుముఖం పట్టింది. 2019లో జననాల రేటు కోటిన్నర ఉండగా అది 2024 నాటికి 95 లక్షలకు పడిపోయింది. దీంతో ఒకప్పుడు జనాభాను అరికట్టేందుకు ప్రపంచంలోనే అత్యంత కఠినమైన కుటుంబ నియంత్రణ విధానాలు అమలు చేసిన చైనా ఇప్పుడు అందుకు విరుద్ధంగా చర్యలు తీసుకుంటున్నది. 1980 నుంచి 2015 మధ్య కాలంలో ఒక జంటకు ఒకే బిడ్డ విధానాన్ని చైనాలో అమలు చేశారు. ఆ తరువాత 2015 నుంచి 2021 మధ్య ఇద్దరు బిడ్డలను కనేందుకు అనుమతించారు. అయినప్పటికీ జననాల రేటు పెరగకపోవడంతో ఇప్పుడు ప్రోత్సాహకాలవైపు మళ్లింది.