జనగామ, నమస్తే తెలంగాణ, డిసెంబర్ 15 : పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు.. పంచాయ తీ పోరులో గులాబీ జెండాను రెపరెపలాడించారు.. అధికారంలో లేకపోయినా.. కాంగ్రెస్ నాయకులు కుట్రలు, కుతంత్రాలు చేసినా.. గెలుపును అడ్డుకునేందుకు ఇబ్బందులు పెట్టినా.. వాటన్నింటిని అధిగమించి ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ నియోజకవర్గంలో మలి విడత జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అ భ్యర్ధులకు అత్యధిక స్థానాల్లో పట్టం కట్టారు. పదేండ్ల కేసీఆర్ పాలనను మరువలేదని, గులాబీ పార్టీపై అభిమానం చెక్కు చెదరలేదని స్పష్టం చేస్తూ బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపారు. రెండో విడతలో ఎన్నికలు జరిగిన జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో మొత్తం 79 జీపీలుండగా 6 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.
మిలిగిన 73 సర్పంచ్ స్థానాలకు ఆదివారం పోలింగ్ జరగగా, 39 పంచాయతీలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఏకగ్రీవాలతో కలుపుకొని మొత్తం 42 స్థానాల్లో విజయం సాధించిం ది. అధికార కాంగ్రెస్‌కు 26, బీజేపీకి 2, స్వతంత్రులకు 9 స్థానాలు దక్కాయి. ఇందులో ఏడుగురు స్వతంత్రులు బీఆర్ఎస్ మద్దతులోనే విజయం సాధించారు. కొన్ని గ్రామాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ అభ్యర్ధులు గట్టి పోటీనిచ్చి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ రెండు చోట్ల గెలిచినప్పటికీ ఓటింగ్ శాతం భారీగా పడిపోగా, పలుచోట్ల స్వతంత్రులు సత్తా చాటారు.
కొన్ని మేజర్ పంచాయతీల్లో ప్రధాన పార్టీల అభ్యర్ధులను మించి ఓట్లు సాధించారు. అత్యధిక గ్రామాల్లో బీఆర్ఎస్ సత్తా చాటడంతో రానున్న స్థానిక ఎన్నికల్లో మెజార్టీ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంటామన్న ధీమా శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. బచ్చన్నపేట మం డలంలోని 26 గ్రామ పంచాయతీల్లో రామచంద్రాపురంలో బీఆర్ఎస్ మద్ధతుతో స్వతంత్ర అభ్యర్థి ఏకగ్రీవం కాగా, మిగిలిన 25 స్థానాల్లో 15 బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇటిక్యాలపల్లిలో కేవలం 2, తమ్మడపల్లిలో 3 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్ధులు ఓటమి చెందారు. జనగామ మండలంలో మొత్తం 21 జీపీల్లో రెండు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా, అందులో ఒకటి బీఆర్ఎస్, మరొకటి స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మిగిలిన 19 స్థానా ల్లో పదింటిలో బీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసింది.
బీజేపీ 2, స్వతంత్రులు 2 స్థానాలు గెలవగా, కాంగ్రెస్ కేవలం ఐదింటికే పరిమితమైంది. నర్మెట మండలంలో మొత్తం 17 స్థానాల్లో ఒకటి ఏకగ్రీవం కాగా, మిగిలిన 16 జీపీలో తొమ్మిదింటిని బీఆర్ఎస్ గెలుచుకుంది. రెండు జీపీల్లో స్వతంత్రులు, ఐదు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. తరిగొప్పుల మండలంలో మొత్తం 15 జీపీలకు 2 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 13 స్థానాల్లో 5 బీఆర్ఎస్ గెలుపొందగా, స్వతంత్రులు 3 స్థానాల్లో విజయం సాధించారు. నర్సాపూర్‌లో అభ్యంతరం తెలిపినా 5 ఓట్ల తేడాతో కాంగ్రెస్ మద్ధతుదారుడు ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించడం వివాదాస్పదమైంది. జనగామ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రజలు పార్టీ అధినేత కేసీఆర్, ఎమ్మెల్యే పల్లాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఓట్ల ద్వారా నిరూపించారనే చర్చ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
