కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ఆన్ చేసి తుంగతుర్తి నియోజకవర్గ రైతాంగానికి గోదావరి జలాలను అందించాలని నాగారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు రైతులతో కలిసి బుధవారం రాస్తారోకో చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కళ్లెట్లపల్లి ఉప్పలయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆసరా పింఛన్‌ను రూ.4వేలకు పెంచాలన్నారు. యాసంగి రైతు భరోసా నిధులను వెంటనే డిమాండ్ చేయాలన్నారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన యూరియా యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. యాప్‌ను వెంటనే రద్దు చేసి సరిపడా యూరియా అందించాలని సూచించారు. లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.