న్యూఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం దేశ రాజకీయాల్లో అపూర్వ ఘట్టానికి తెరలేవబోతున్నది. దేశంలో గుణాత్మక మార్పు కోసం నడుం కట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు.. ఢిల్లీలో పార్టీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. ఢిల్లీ నడిబొడ్డున సర్దార్ పటేల్ రోడ్డులో బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
ఆ తర్వాత మధ్యాహ్నం 12:37 గంటలకు పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమాలకు జేడీఎస్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌తోపాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.
పార్టీ జెండా ఆవిష్కరణ కోసం సీఎం కేసీఆర్ బుధవారం మధ్నాహ్నం 12 గంటలకు పార్టీ కార్యాలయానికి చేరుకొంటారు.
కార్యాలయంలో నిర్వహిస్తున్న రాజశ్యామల యాగం పూర్ణాహుతిలో పాల్గొంటారు. పూర్ణాహుతి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలు తీసుకొని తన కార్యాలయంలో కుర్చీలో ఆసీనులవుతారు. పార్టీకి సంబంధించిన పత్రాలపై సంతకం చేస్తారు.