హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఎదిగిందని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగం అవతరించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక చర్చలో సురేశ్‌రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 కారణంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని, అక్కడ నుంచి సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్లో మాట్లాడే అవకాశం తనకు లభించిందని సురేశ్‌రెడ్డి చెప్పారు. రాజ్యాగం తమకు ప్రేరణనిచ్చిందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని మార్గదర్శక సూత్రాల ఆధారంగా కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చగలిగామని చెప్పారు. దేశంలోనే ఇప్పుడు తెలంగాణవాసి అత్యంత సంపన్నుడని, తలసరి ఆదాయంలో నంబర్‌వన్‌గా నిలిచామని, దేశ జీడీపీలో తెలంగాణ భాగస్వామ్యం 4.08 శాతమని తెలిపారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 ప్రకారం గ్రామ పంచాయతీ వ్యవస్థ ఏర్పాటైందని, తెలంగాణలో గ్రామాలను బలోపేతం చేశామని సురేశ్‌రెడ్డి చెప్పారు. గ్రామాలను అభివృద్ధి పరిచామని, పచ్చదనం, పారిశుద్ధ్యం వంటి అనేక అంశాల్లో విజయాలు సాధించామని గుర్తుచేశారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అందించిన జాతీయ అవార్డులే నిదర్శనమని తెలిపారు. ఈ సందర్భంగా పార్లమెంటుకు కొన్ని సూచనలు చేశారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత కఠినతరం చేయాలని సూచించారు. దేశాభివృద్ధికి అధికంగా సహకరిస్తున్న రాష్ట్రాలను జనాభాపరంగా కాకుండా వాటి ఫలితాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. చిన్న పార్టీగా ప్రస్తుతం నలుగురు సభ్యులమే ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యం కోసం సభలో తమ బాధ్యతలను, హక్కులను నిర్వర్తిస్తూనే ఉంటామని చెప్పారు.