MLA Kaushik Reddy | హైదరాబాద్ : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. కాంగ్రెస్ సీనియర్ జైరాం రమేష్ సుదర్శన్ రెడ్డికి 315 ఓట్లు పడ్డాయని ట్వీట్ చేశారు. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు మాత్రమే పడ్డాయి. మరి 15 ఓట్లు ఎటు వెళ్ళాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎనిమిది మంది ఎంపీలు ఎన్డీఏ అభ్యర్థికి ఓట్లు వేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలు అయ్యాక మేము బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేశామని కాంగ్రెస్ ఎంపీలు నిర్మలా సీతారామన్ ను కలిశారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. తెలంగాణ కాంగ్రెస్ 8 మంది ఎంపీలు లోక్సభ స్పీకర్ను కలిశారు. క్రాస్ అయిన 15 ఓట్లలో 8 మంది తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు ఉన్నాయని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
తెలంగాణకు రేవంత్ రెడ్డి ద్రోహం చేశారు. రేవంత్ రెడ్డి చంద్రబాబుతో లింక్ పెట్టుకుని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు అమ్ముకున్నారు. నాకు ముగ్గురు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కలిసి బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓటు వేశామని చెప్పారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఓట్ చోరీ చేస్తున్నారు. సుప్రీంకోర్టు మాజీ జడ్జి సుదర్శన్
రెడ్డిని రేవంత్ రెడ్డి మోసం చేశారు. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చంద్రబాబు నాయుడు, మోడీకి చెల్లిస్తున్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డికి రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారు అని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ చెప్తే రేవంత్ రెడ్డి అభ్యర్థిని పెట్టారు. మోడీ చెప్తే ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఓట్లు వేశారు. రేవంత్ రెడ్డికి అమ్ముకోవడం అలవాటు. గ్రూప్1 పోస్టులను అమ్ముకున్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే గన్ మెన్ యూరియాను అమ్ముకున్నారు. సిబిఐ, ఐటీ, ఈడీ బీజేపీ జేబు సంస్థలు అని రాహుల్ గాంధీ అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ అని రేవంత్ రెడ్డి అంటారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రులు ఎవరికి తెలియకుండా రేవంత్ రెడ్డి సిబిఐ విచారణకు ఇచ్చారని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ వాళ్ళను చూస్తే జాలివేస్తోంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రినా లేక బీజేపీకి ముఖ్యమంత్రా. నరేంద్రమోదీ ఏది చెప్తే రేవంత్ రెడ్డి అది చేస్తున్నారు. మోడీకి, రేవంత్ రెడ్డికి ఒప్పందం లేకపోతే గ్రూప్1 పోస్టుల అమ్మకాలపై సిబిఐ విచారణ జరిపించాలి. బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు హడావిడి చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్ ఇప్పుడు సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి నడిసముద్రంలో ముంచుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకుంటున్నారా…? 15 ఓట్లు ఎవరు దొంగతనం చేశారో కాంగ్రెస్ తేల్చుకోవాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా బీసీ నేత వి.హనుమంతరావును ఎందుకు నిలబెట్టలేదు. రేవంత్ రెడ్డి బీసీలకు ద్రోహం చేశారు. తెలంగాణకు వచ్చే రాజ్యసభ సీటును పక్క రాష్ట్రం వ్యక్తికి రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు.