Puja Khedkar : నవీ ముంబై (Navy Mumbai) లో ట్రక్కు డ్రైవర్ (Truck driver) కిడ్నాప్‌కు గురైన కేసు మరో మలుపు తిరిగింది. అతడిని కిడ్నాప్ చేసింది మాజీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ (Puja Khedkar) తండ్రి దిలీప్ ఖేద్కర్ (Dilip Khedkar) అని తేలింది. దాంతో పోలీసులు ఆ డ్రైవర్‌ను రక్షించేందుకు ప్రయత్నం చేయగా.. దిలీప్ ఖేద్కర్ భార్య మనోరమ ఖేద్కర్ (Manorama Khedkar) పోలీసుల పైకి కుక్కలను ఉసిగొల్పారు. కానీ పోలీసులు చాకచక్యంగా డ్రైవర్‌ను రక్షించారు. అయితే ఖేద్కర్ దంపతులు మాత్రం అక్కడి నుంచి పారిపోయారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 13న దిలీప్ ఖేద్కర్ ప్రయాణిస్తున్న కారును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదం తర్వాత దిలీప్, ఆయన బాడీగార్డు ప్రఫుల్ల, ట్రక్కు డ్రైవర్ ప్రహ్లాద్‌తో వాగ్వాదానికి దిగారు. పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్తామనే నెపంతో అతడిని 150 కిలోమీటర్ల దూరంలోని పుణెకు తీసుకెళ్లారు. తనను బలవంతంగా పుణెకు తీసుకెళ్తున్నారనే విషయాన్ని ట్రక్కు డ్రైవర్ యజమానికి ఫోన్లో తెలియజేశాడు.
దాంతో ట్రక్కు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు వాహనం నంబర్ ఆధారంగా పుణెలోని ఖేద్కర్ నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో పూజా ఖేద్కర్ తల్లి మనోరమ ఖేద్కర్ వారిని అడ్డుకుంది. గేటు తెరవడానికి నిరాకరించింది. పోలీసు అధికారులను దూషించడమే కాకుండా.. వారిపైకి కుక్కలను ఉసిగొల్పింది. చివరికి పోలీసులు లోపలికి ప్రవేశించి డ్రైవర్‌ను రక్షించారు. కిడ్నాప్‌నకు ఉపయోగించిన కారు వారి ఇంటి పరిసరాల్లోనే కనిపించింది.
దాంతో ఆధారాలను ధ్వంసం చేయడం, విధులకు ఆటంకం కలిగించడం లాంటి ఆరోపణలతో మనోరమపై కేసు నమోదు చేశారు. కాగా పూజా ఖేద్కర్ కుటుంబసభ్యుల తీరు వివాదాస్పదం కావడం ఇదేమీ తొలిసారి కాదు. తప్పుడు ఓబీసీ, దివ్యాంగ పత్రాలు సమర్పించి పూజా ఖేద్కర్ యూపీఎస్సీలో ఉద్యోగం పొందారు. తోటి అధికారితో గొడవ పడగా ఆ వివాదం కాస్తా ఆమె ధ్రువపత్రాల విచారణకు దారితీసింది. దాంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు.
మనోరమ ఖేద్కర్ కూడా గతంలో ఓ రైతుకు తుపాకీ చూపిస్తూ బెదిరిస్తున్న వీడియో వైరల్ అయ్యింది. దాంతో కుటుంబం మొత్తంపై దాడి, బెదిరింపు కేసులు నమోదయ్యాయి. తాజాగా దిలీప్ ఖేద్కర్‌పై కిడ్నాప్ కేసు నమోదుకావడంతో దంపతులిద్దరూ అదృశ్యమయ్యారు.